బ్రిటిష్ సిద్ధాంతాన్ని ఇప్పుడు బీజేపీ పాటిస్తోంది : ఎమ్మెల్సీ కవిత

-

గిరిజనుల పట్ల కేంద్ర ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తున్నదని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. మణిపూర్‌లో ప్రభుత్వ ప్రోత్సాహంతోనే దారుణాలు జరుగుతున్నాయని ఆరోపించారు. విభజించు పాలించు సిద్ధాంతాన్ని అవలంబిస్తూ బీజేపీ ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నదని కల్వకుంట్ల కవిత విమర్శించారు. బ్రిటిష్ వారు మొదలుపెట్టిన విభజించు పాలించు అన్న సిద్ధాంతాన్ని ఇప్పుడు బీజేపీ పాటిస్తోందని ధ్వజమెత్తారు. మణిపూర్‌లో జరుగుతున్న పరిణామాలను తీవ్రంగా ఖండించారు. మణిపూర్‌లో ప్రభుత్వ ప్రాయోజిత హింస జరుగుతుందని ఆరోపించారు. శనివారం శాసన మండలిలో గిరిజనుల స్థితిగతులపై జరిగిన స్వల్పకాలిక చర్చలో పాల్గొని కవిత మాట్లాడారు.

మణిపూర్ ఘటనలను దేశ గిరిజనులపై ప్రభుత్వ ప్రయోజిత హింసగా కవిత అభివర్ణించారు. రెండు గిరిజన తెగల మధ్య కొట్లాట పెట్టించి మొత్తం యంత్రాంగం నిలబడి చూసుకుంటూ ఉన్న పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని జాతులు బాగుపడాలని మనం కోరుకుంటుంటే.. విభజించి పాలించి ఓట్లు దండుకోవాలన్న ప్రయత్నం కేంద్రంలో కనిపిస్తోందని స్పష్టం చేశారు. ఐక్యతనే బీఆర్ఎస్ సిద్ధాంతమని తేల్చిచెప్పారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా గిరిజన హక్కులను హరిస్తోందని విమర్శించారు. గ్రామ సభలు తీర్మానం చేసే హక్కును కూడా తొలగిస్తూ చట్ట సవరణ చేసే ప్రయత్నం చేశారన్నారు. అటవీ హక్కులను పూర్తిగా నిర్వీర్యం చేశారని, పెసా చట్టాన్ని చాలా పేలవంగా అమలు చేస్తున్నారని కాగ్ కూడా తేల్చిందని సభ దృష్టికి తీసుకొచ్చారు. తెలంగాణలో తప్పా మిగితా ఏ రాష్ట్రంలోనూ పెసా చట్టం సమర్థవంతంగా అమలు కావడం లేదన్నారు. గిరిజన సబ్ ప్లాన్ నుంచి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని, పదేపదే కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తున్నా పట్టించుకున్న పాపాన పోలేదని ధ్వజమెత్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version