ఎంపీ అరవింద్ టార్గెట్ గా రాజకీయం మొదలెట్టిన ఎమ్మెల్సీ కవిత

-

నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నుంచి ఎన్నికైన మాజీ ఎంపీ కవిత రూట్ మార్చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వచ్చిన తర్వాత కొంత కాలం సైలెంట్‌గా ఉన్న కవిత ఎమ్మెల్సీ పదవి చేపట్టాక గేర్ మార్చారు. ఐదురోజులపాటు జిల్లాలోనే ఉండటం.. ఎంపీ అరవింద్ టార్గెట్ గా రాజకీయాలు నడుపుతూ ప్రజలకు అందుబాటులో ఉండటంతో జిల్లాలోని అధికార పార్టీ నేతలు.. ప్రజల మధ్య ఇదే అంశంపై చర్చ నడుస్తుంది.

నిజామాబాద్‌ లోక్‌సభ సభ్యురాలిగా ఉన్న సమయంలో బిజీగా ఉండేవారు కవిత. జిల్లా పర్యటనకు ఇప్పటిలా ఎక్కువ రోజులు వచ్చేవారు కాదు. కార్యకర్తలు, ప్రజలు తమ సమస్యలను విన్నవించుకునేందుకు ఎదురు చూడాల్సి వచ్చేదట. ఇలాంటి వైఖరి వల్లే గత ఎన్నికల్లో ఇబ్బంది పడ్డామని గ్రహించారో ఏమో.. ఇప్పుడు పూర్తిగా రూటు మార్చేశారు కవిత. ప్రస్తుతం జిల్లా వాసులను, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలను నిత్యం కలిసి మాట్లాడేందుకు చొరవ తీసుకుంటున్నారు. ప్రజలు ఇచ్చిన వినతిపత్రాలపై ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించేలా చొరవ చూపుతున్నారు.

2019 ఎన్నికల్లో పసుపు బోర్డు అంశం తెరమీదకు రావడంతో రెండోసారి ఎంపీగా కవిత ఓడిపోయారు. ఇప్పడదే అంశం పై మళ్లి కవిత ఫోకస్ పెట్టారు. ఎంపీ అరవింద్ కేంద్రంలో అధికారంలో ఉన్నా సాధించలేకపోయారన్నది ప్రజల్లో చర్చ జరిగేలా చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కావడంతో స్థానిక ప్రజాప్రతినిధులకు సైతం భరోసా ఇచ్చారని టాక్‌. ఇటీవల స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీలు అయిన వారితో సమావేశాలు నిర్వహించిన కవిత.. నిధులు, విధులపై చర్చించారు. త్వరలో అంతా కలిసి సీంఎ కేసీఆర్‌తో మాట్లాడాలని నిర్ణయించారట.

గత ఎన్నికల్లో తన ఓటమికి ప్రధాన కారణమైన జిల్లాలోని బీసీ కులాల వారికి వీలైనంత ఎక్కువ లబ్ధి చేకూర్చడంపై కవిత దృష్టి పెడుతున్నారట. ఇటీవల బీసీ సంక్షేమ శాఖ మంత్రిని జిల్లాకు రప్పించి బీసీ సంఘాలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సావిత్రిబాయి పూలే భవన్‌ పేరుతో జిల్లా బీసీభవన్‌..ఉద్యోగార్ధుల కోసం బీసీ స్టడీ సర్కిల్‌కు ప్రత్యేక భవన నిర్మాణానికి నిధులు తెచ్చేందుకు చర్యలు చేపట్టారు. ఎస్సీ ఉప కులాల ప్రతినిధులతోనూ కవిత సమావేశమయ్యారు. దీంతో ఓటమి తర్వాత వ్యూహం మార్చేశారని అంతా అనుకుంటున్నారు.

నెలలో ఐదు రోజులపాటు జిల్లాలోనే ఉండాలని నిర్ణయించారట. అంతేకాదు..కవిత రీ ఎంట్రీ తర్వాత జిల్లాలోని టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు సైతం అలర్ట్‌ అయినట్టు తెలుస్తుంది. మొత్తానికి కవిత పంథా మార్చి జనంలో ఉండటం ఎంపీ అరవింద్ పై కూడా ఫోకస్ పెట్టడంతో ఇందూరు రాజకీయం పై ఆసక్తికర చర్చ నడుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news