సోనియా గాంధీ కుటుంబానికి కేంద్రం షాకిచ్చింది. వారికి చెందిన రాజీవ్ గాంధీ ఫౌండేషన్ (ఆర్‌జీఎఫ్), రాజీవ్ గాంధీ చారిటబుల్ ట్రస్ట్, ఇందిరా గాంధీ మెమోరియల్ ట్రస్ట్‌లకు వచ్చిన, వస్తున్న నిధుల విషయంలో మనీ లాండరింగ్, ఎఫ్ఆర్‌సీఏ, ఐటీ చట్టాలను ఉల్లఘించారనే ఆరోపణల నేపథ్యంలో కేంద్రం చర్యలకు పూనుకుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం బుధవారం అందుకు ఒక కమిటీని నియమించింది. సదరు ఆర్థిక అవకతవకలపై విచారణ జరిపేందుకు గాను కేంద్రం ఓ అంతర్ మంత్రిత్వ కమిటీని ఏర్పాటు చేసింది.
కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) స్పెషల్ డైరెక్టర్ నేతృత్వం వహిస్తారు. అలాగే సీబీఐ కూడా ఇందులో భాగంగా ఉంటుంది. ఈ మేరకు కమిటీ వివరాలను కేంద్ర హోం శాఖ అధికార ప్రతినిధి బుధవారం వెల్లడించారు. కాగా ఆర్‌జీఎఫ్‌కు సోనియా గాంధీ చైర్ పర్సన్‌గా ఉన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, పి.చిదంబరంలు ట్రస్టీలుగా ఉన్నారు. ఇక రాజీవ్ గాంధీ చారిటబుల్ ట్రస్ట్, ఇందిరా గాంధీ చారిటబుల్ ట్రస్ట్‌లకు కూడా సోనియా గాంధీ చైర్ పర్సన్‌గా ఉన్నారు.
యూపీఏ హయాంలో సదరు ఫౌండేషన్, ట్రస్ట్‌లకు వచ్చిన విరాళాల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలపై కేంద్రం స్పందించి సదరు కమిటీని నియమించింది. అయితే దీనిపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం స్పందించాల్సి ఉంది.