జపాన్ లో రేపు జరగబోయే క్వాడ్ సదస్సులో పాల్గొనేందుకు భారత ప్రధాని మోడీ ఆ దేశానికి బయలుదేరిన విషయం తెలిసిందే. ఈరోజు ఉదయం టోక్యో చేరుకున్న మోదీకి ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. అక్కడి హోటల్ న్యూ కోటా ఒటానీలో మోదీ బస చేస్తున్నారు. అక్కడి ప్రవాస భారతీయులు ‘మోదీ మోదీ’ ‘వందేమాతరం’ ‘భారత్ మాతాకీ జై’ నినాదాలు చేశారు. భారత జాతీయ జెండా లు ఊపుతూ మోదీని పలకరించారు.
వారితో కాసేపు మోదీ ముచ్చటించారు. చిన్నారులతోనూ మోడీ మాట్లాడారు. వివిధ భాషల్లో స్వాగతం అని రాసిన ప్లకార్డులను చిన్నారులు పట్టుకొని మోడీ కి స్వాగతం పలికారు. కాగా ఈ పర్యటనలో మోడీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో భేటీ కానున్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు, అంతర్జాతీయ పరిణామాలపై ఇద్దరు నేతలు చర్చించనున్నట్లు సమాచారం. జపాన్ పర్యటనలో భాగంగా మోదీ 40 గంటలు ఆ దేశంలో గడపనున్నారు. ఈ సమయంలో ఆయన మొత్తం 23 సమావేశాల్లో పాల్గొంటారు. జపాన్ కు చెందిన 30 మంది సీఈవోలు, దౌత్యవేత్తలు, అక్కడ స్థిరపడిన భారతీయులతో మోదీ సమావేశమవుతారు.