గబ్బాలో దుమ్మురేపిన హైదరాబాదీ

-

గబ్బాలో హైదరాబాదీ దుమ్ము రేపాడు. సిరీస్‌కు ముందే నాన్నను కోల్పోయినా..! మైదానంలో ఆస్ట్రేలియా ప్రేక్షకుల రేసిజానికి గురైనా..! రికార్డు సృస్టించాడు. కంగారులను సొంత గడ్డపై కంగారెత్తించాడు. అరంగ్రేటం చేసిన సిరీస్‌లోనే బౌలింగ్‌లో చెలరేగిపోయాడు. సిరీస్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఆసీస్‌ టూర్‌కి ముందే ఇషాంత్‌ వెనుదిరిగాడు..షమీ గాయంతో దూరమయ్యాడు..ఉమేష్‌, బూమ్రా కూడా పెవిలియన్‌ చేరడంతో.. గబ్బా టెస్ట్‌లో టీమిండియా బౌలింగ్‌కి సారథ్యం వహించేది ఎవరు..? ఈ ఆలోచనలు టీమిండియా మెనేజ్‌మెంట్‌ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. మూడు టెస్ట్‌ల అనుభవంతోనే భారత బౌలింగ్‌ బృందాన్ని ముందుండి నడిపించాడు మహమ్మద్‌ సిరాజ్‌. మూడు టెస్ట్‌ల అనుభవంతోనే కంగారులకు చుక్కలు చూపించాడు. పక్కా లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో అద్భుతం చేశాడు. చివరి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో ఐదువికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. నాన్న కలను సాకారం చేశాడు.

ముందు సిరాజ్‌ పై..ఎవరికీ పెద్దగా అంచనాల్లేవ్‌. అసలు ఆసీస్‌ బ్యాటింగ్‌ లైనప్‌ను అడ్డుకుంటారన్న గ్యారెంటీ లేదు. కానీ మూడో టెస్ట్‌లోనే సిరాజ్‌ సంచలనంగా మారాడు. నాలుగో టెస్ట్‌కి ముందు సిరాజ్‌ మాత్రమే అత్యధిక మ్యాచ్‌లు ఆడిన బౌలర్‌. శార్దూల్‌, నటరాజన్‌, వాషింగ్టన్‌ సుందర్‌లకు అసలు అనుభవం లేదు. కానీ ఈ టెస్ట్‌లో సిరాజ్‌ పెద్దన్న పాత్ర పోషించాడు. రెండో ఇన్నింగ్స్‌లో భారీస్కోరు చేయకుండా కట్టడి చేశాడు. కేవలం 73 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు. ఈ సిరీస్‌లో ఏకంగా 13 వికెట్లు పడగొట్టాడు. ఆస్ట్రేలియా టాప్‌ బౌలర్లు పాట్‌ కమ్మిన్స్‌, హజల్‌వుడ్‌ తర్వాత అత్యధిక వికెట్లు తీసింది సిరాజే..! సిరీస్‌లో ఆడింది మూడు మ్యాచ్‌లే అయినా.. భారత్‌ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.

సిరాజ్.. అందరి క్రికెటర్లలా కాదు..! సిరీస్‌కి ముందే తండ్రిని కోల్పోయాడు. కనీసం కడసారి చూపు కూడా చూడలేకపోయాడు. ఇండియాకు తిరిగి వచ్చేందుకు అవకాశం ఉన్నా.. నిరాకరించాడు. ఎందుకంటే నాన్న కల కోసం..! టెస్ట్‌ క్రికెటర్‌గా చూడాలన్న తండ్రి కోరిక కోసం.. కసితో ఆడాడు. మధ్యలో ఎన్నో ఇబ్బందులు ఎదురైనా.. ఆత్మస్థైర్యం కోల్పోలేదు. అందుకే పదే పదే సిరాజ్‌ ఆస్ట్రేలియా ప్రేక్షకులు టార్గెట్‌ చేసినా.. నోటికి పని చెప్పి అడ్డగోలుగా వాగినా.. పట్టించుకోలేదు. వాళ్లందరికీ తన ఆటతో సమాధానం చెప్పాడు. నాన్నా కల నెరవేర్చాడు. గబ్బా టెస్ట్‌లో భారత చారిత్రాత్మక విజయంలో సిరాజ్‌ది కీలక పాత్ర..! అందుకు ఇప్పుడు హైదరాబాద్‌ పాతబస్తీ గల్లీ నుంచి గబ్బా స్టేడియం వరకు ఇప్పుడు సిరాజ్‌ ప్రదర్శన రీ సౌండ్‌ వస్తోంది.

ఐదు వికెట్లు తీసిన సిరాజ్‌పై టీమిండియా క్రికెటర్లు ప్రశంసలు గుప్పిస్తున్నారు. ఈ హైదరబాదీ సూపర్‌ అంటున్నారు. ఆసిస్ టూర్‌లో అసలైన సంచలనం సిరాజే అన్నాడు సెహ్వాగ్. తండ్రిని కోల్పోయిన బాధలోనూ ఎంతో అద్భుతంగా ఆడాడని.. కేటీఆర్ కీర్తించాడు. ఇలా ఒక్కరేమిటీ… వెటరన్ క్రికెటర్స్ అంతా ఇప్పుడు సిరాజ్ స్పెల్‌ గురించే మాట్లాడుకుంటున్నారు. మియా భాయ్‌.. లగేరహో అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news