ఆ ప్రాంతంలో ఓ పలుకుబడిన వ్యక్తి. అతడు పేదలు, రైతుల నుంచి అక్రమంగా డబ్బు కాజేసేవాడు. అప్పుడే అక్కడికి హీరో ఎంటర్ అవుతాడు. ఆ వ్యక్తితో తెలివిగా ఫైట్ చేసి అక్రమంగా దోచేసిన డబ్బంతా అందరి ఖాతాల్లోకి బదిలీ చేయిస్తాడు. ఇదంతా వింటుంటే ఏదో సినిమా కథలా ఉంది కదా. ఉండటమేంటి సినిమా కథే. ఇప్పుడు దీని గురించి ఎందుకంటారా..> ఎందుకంటే.. అచ్చం ఇలాంటి సంఘటనే రియల్ లైఫ్ లో కూడా జరిగింది. అయితే ఇక్కడ హీరో, విలన్లు ఉన్నారో..? ఉంటే ఎవరో..? మాత్రం తెలియదు. అసలు సంగతేంటో తెలియాలంటే ఈ స్టోరీ చదివేయండి మరి.
వరంగల్ అర్బన్ జిల్లా రాయపర్తి మండలంలోని మూడు గ్రామాల రైతుల బ్యాంకు ఖాతాలోకి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి నగదు జమ అవుతోంది. ఊకల్, గట్టికల్, జగన్నాథపల్లి గ్రామాల రైతులకు ఏపీజీవీబీ, కెనరా, బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకులలోని వారి ఖాతాల్లోకి సుమారు రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు నగదు జమ అయినట్లు చరవాణులకు సమాచారం వస్తోంది. నగదు ఎక్కడి నుంచి ఎవరు జమ చేస్తున్నారో తెలియక వారు ఆశ్చర్యానికి లోనవుతున్నారు. వెంటనే తమ ఖాతాల నుంచి నగదు తీసుకుంటున్నారు. విషయం తెలుసుకున్న మరికొంత మంది రైతులు వారి వారి బ్యాంకుల వద్దకు వెళ్లి ఖాతాలు చూసుకుంటున్నారు. నగదు జమ కాని వారు తీవ్ర నిరాశకు గురువుతున్నారు.
భూమి లేని వారి ఖాతాల్లోకి నగదు పడటంతో పరిహారం కాకపోవచ్చని భావిస్తున్నారు. ఈ ఘటనపై సదరు బ్యాంక్ అధికారులను వివరణ కోరగా వారూ ఎటూ చెప్పలేక పోతున్నారు. దీనిపై సంబంధిత జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఉషా దయాళ్ను సంప్రదించంగా చాలాకాలం కింద పంట బీమా చేసుకున్న వారికి ఇన్సూరెన్స్ రూపంలో ఈ డబ్బులు వస్తున్నాయో.. లేక ఏ ఇతర కారణాల వల్ల వస్తున్నాయో తెలియడం లేదన్నారు. దీనిపై రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు ఆమె వెల్లడించారు.