పిల్లని చదివించుకోవాలి అందుకు తగ్గ స్థోమత లేదు అందుకే కిడ్నీలు అమ్ముకునేందుకు అనుమతి ఇవ్వండి అంటూ ఏపీలో ఒక తల్లి కలెక్టర్ ను అనుమతి కోరడం సంచలనంగా మారింది. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా హిందూపురంలో మక్బూల్ జాన్, అయూబ్ ఖాన్ల కుమార్తె రూబియా. ఫిలిప్పీన్స్ దేశంలో దావోస్ సిటీలో వైద్య విద్యను అభ్యసిస్తోంది. ప్రభుత్వం నుంచి విదేశీ విద్య స్కాలర్షిప్ వస్తుందన్న ధైర్యంతో కుమార్తెను అంత దూరం పంపించారు తల్లితండ్రులు. ఒకవేళ అది రాకపోతే.. తమకున్న ఇల్లు తాకట్టు పెట్టి అయినా చదివించాలని అనుకున్నారు.
అయితే ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చాక విదేశీ విద్య స్కాలర్షిప్ పథకం అమలు కాకపోవడం.. ఫీజులు కట్టేందుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందకుండా పోవడంతో పాటు ఉన్న ఇల్లు తాకట్టు పెట్టాలన్నా, అమ్మాలన్నా నిబంధనలు అడ్డు వచ్చాయి. అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోవడంతో తన కుమార్తె చదువు కోసం ఆ తల్లి ఆమరణ నిరాహార దీక్షకు దిగింది. తమ కిడ్నీ అమ్ముకునేందుకు అనుమతి ఇవ్వాలని కలెక్టర్ కు అర్జీ పెట్టుకుంది రుబియా తల్లి. మరి ఇప్పటికి అయినా ఆ తల్లి బాధను అధికారులు అర్ధం చేసుకుంటారో ? లేదో చూడాలి.