తెలంగాణ రాజకీయం మంచి రసవత్తరంగా సాగుతుంది. ఈటల రాజేందర్ వ్యవహారం మొదలు కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా రేవంత్ ని నిర్ణయించడం రాజకీయాలు హాట్ హాట్‌గా మారిపోయాయి. పార్టీలేవి సన్నాసుల మఠాలు కావు కాబట్టి ఆ పార్టీలోంచి ఈ పార్టీలోంచి వచ్చే జంపింగ్‌లను చేర్చుకుంటున్నాయి. రాజకీయా నాయకులకు సిద్ధాంతాలనేవే లేవనడంలో ఎలాంటి సందేహం లేదు.
అప్పటికి ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ భజన చేయడంలో మాత్రం ముందుంటున్నారు. ఇప్పుడు మోత్కుపల్లి నర్సింహులు బీజేపీకి రాజీనామా చెయ్యడం ఆశ్చర్య పరిచినా.. విమర్శిచడం మాత్రం ఏ మాత్రం ఆశ్చర్యానికి గురిచెయ్యలేదు. ఈటలను బీజేపీలో చేర్చుకునే విషయంలో మోత్కుపల్లిని సంప్రదించలేదట, ఆయన రాజకీయ అనుభవాన్ని పరిగణలోకి తీసుకోలేదని నొచ్చుకున్నానంటూ ఆవేదన వెలిబుచ్చారు.
సరే ఏది ఏమైతే నేం మోత్కుపల్లి కానీ ఇంకే నాయకుడైనా కానీ అల్టర్ నేటివ్ లేకుండా రాజీనామాలు చేసేంత అమాయకులేం కారు. మోత్కుపల్లి ఏ పార్టీలో చేరబోతున్నారు అనే ప్రశ్న. మోత్కుపల్లి రాజీనామాలో ఈటలను విమర్శించడం, ఈటల దళితుల భూములు కబ్జా చేశారంటూ ఆరోపణలు చెయ్యడం చూస్తుంటే ఆయన కారెక్కబోతున్నారేమో అనిపిస్తుంది. అంతే కాకుండా సీఎం కేసీఆర్ దళితుల పట్ల ప్రేమ కనబరుస్తున్నారని పొడగ్తలు గుప్పించడం టీఆర్ఎస్‌లోకి చేరిక అనే వార్తకు బలం చేకూరుస్తుంది.
తెలంగాణ ఉద్యమ సమయంలో కానీ, టీడీపీలో ఉన్నప్పుడు కానీ మోత్కుపల్లి కేసీఆర్‌ని, టీఆర్ఎస్ పార్టీని తిట్టడంలో అందరికంటే ముందే ఉండేవారు. ఆయన తిట్టిన తిట్లు పరిధి దాటిన సందర్భాలు ఉన్నాయి.. మరి అలాంటప్పుడు టీఆర్ఎస్‌లోకి ఎంట్రి ఉంటుందా అనేది అనుమానం. కానీ టీఆర్ఎస్ పక్కా రాజకీయ పార్టీ, సన్నాసుల మఠం కాదంటూ స్వయానా కేసీఆరే ప్రకంటిచడం చూస్తుంటే మాత్రం మోత్కుపల్లికి అవకాశాలు ఉన్నట్లే కనిపిస్తుంది.
రాజకీయాల్లో విలువల కోసమే పనిచేసే నన్ను దూరం పెట్టడం బాధాకరంగా భావిస్తున్నాను.. అందుకోసం నేను పార్టీకి రాజీనామా చేస్తున్నాను… అంటూ రాజీనామాలో పెర్కొన్న విలువలు అనే పదాన్ని మాత్రం రాజకీయ విమర్శకులు హైలైట్ చేస్తున్నారు. జాతీయ పార్టీలో విలువల కోరుకోవడం, రేపు టీఆర్ఎస్‌లో కూడా విలువలు అనే దాన్ని ఆశించడం అమాయకత్వం అంటూ విమర్శిస్తున్నారు. ఇప్పటివరకు టీఆర్ఎస్‌లో చేరిన మహామహులు ఏమయ్యారో చూస్తునే ఉన్నాం.
ఒక వేళ కాంగ్రెస్ పార్టీలో చేరేటట్లయితే అక్కడ కూడా విలువల కోసం ఆరాట పడటం వృద్ధా ప్రయాసే. విలువల కోసం రాజకీయం చేయలనుకునే కంటే రాజకీయాలకు స్వస్త చెప్పి ప్రజాలకు సేవ చేసేలా ఆలోచించుకుంటే బెటర్ అంటూ సలహాలిస్తున్నారు.
మొత్తంగా టీడీపీ పార్టీ నాయకులందరికీ టీఆర్ఎస్ ఆదుకుంటూ అక్కున చేర్చుకుంటుంది మరి. ఒక్కసారి టీఆర్ఎస్ లైనప్ చూస్తే ఇట్టే అర్థమవుతుంది.