తెలంగాణలో వైయస్ షర్మిలకు కేఏ పాల్ కన్నా తక్కువ ఓట్ల వస్తాయని ఎద్దేవా చేశారు ఎంపీ మాలోత్ కవిత. షర్మిల తన మాటలను అదుపులో పెట్టుకోకపోతే టిఆర్ఎస్ కార్యకర్తలను ఆపడం మా వల్ల కూడా కాదని హెచ్చరించారు. బయ్యారం గనులను దోచుకున్నది షర్మిల కుటుంబమేనని, తెలంగాణను దోచుకోవడానికి షర్మిల పాదయాత్ర చేస్తున్నారని ఆరోపించారు. షర్మిల పాదయాత్రలు చేసిన, పొర్లుదండాలు పెట్టిన తెలంగాణ ప్రజలు నమ్మరని అన్నారు.
41 నియోజకవర్గాలు తిరిగి.. 41 మంది ఎమ్మెల్యేల మీద అడ్డమైన కూతలు కూస్తూ, ముఖ్యమంత్రి కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడమే తప్ప ఏ నియోజకవర్గ సమస్యనైనా ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చిందా? అని ప్రశ్నించారు. ఆంధ్రాలో తన పప్పులు ఉడకడం లేదనే తెలంగాణలో షర్మిల డ్రామాలు చేస్తుందని మండిపడ్డారు. తెలంగాణకు రావలసిన విభజన చట్టం హామీల గురించి షర్మిల ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. ఆంధ్రాలో ఓటు వేసి తెలంగాణ రాజకీయాల గురించి షర్మిల మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు.