అమరావతి ఎంపీ నవనీత్ రాణా, రవి రాణా దంపతులపై ముంబై సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు అయింది. వీరిద్దరూ బెయిల్ షరతులను ఉల్లంఘించారని, బెయిల్ రద్దు చేయాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. కాగా, హనుమాన్ చాలీసా వివాదంపై ఎంపీ నవనీత్ రాణా దంపతులకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ పిటిషన్‌పై ఈ నెల 27వ తేదీన కోర్టు విచారణ చేపట్టనున్నది.
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే నివాసం ఎదుట హనుమాన్ చాలీసా పఠిస్తామని ఎంపీ నవనీత్ రాణా దంపతులు ప్రకటించారు. దీంతో వీరిద్దరిని ముంబై పోలీసులు ఏప్రిల్ 23వ తేదీన అరెస్ట్ చేశారు. అనంతరం దంపతులిద్దరు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా తిరస్కరించింది. ఆ తర్వాత ముంబై కోర్టు రూ.50 వేల పూచీకత్తుతోపాటు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. షరతులను ఉల్లంఘిస్తే.. బెయిల్ రద్దు చేస్తామని కోర్టు హెచ్చరించింది. అలాగే పోలీసులకు 24 గంటల ముందుగా నోటీసులు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.