రాజకీయ లబ్దికోసం తెలంగాణ రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేశాయని ఎంపీ, మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రబీ సీజన్‌లో రైతులు 52 లక్షల ఎకరాల్లో సాగు చేశారని, ఇప్పుడు 35 లక్షల వరకు మాత్రమే సాగు చేస్తున్నారన్నారు. ప్రత్యామ్నాయ పంట లేకుండా చేశారని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపైఒకరు విమర్శలు చేసుకుంటూ రైతులను మోసం చేశారని ఆయన ఆరోపించారు. కేసీఆర్ చేత కానీ తనం తోనే రైతులు నష్టపోయారన్న ఉత్తమ్.. ఎరువుల ధరలు…ప్రతి ఏడాది పెరుగుతున్నాయన్నారు.
మూడేళ్ల క్రితం రైతులకు ఉచిత ఎరువులు ఇస్తామని, రుణమాఫీ చేస్తామని రైతులను మభ్యపెట్టారని, 4 సంవత్సరాలైనా మాఫీ కాలేదన్నారు. నాలుగేళ్లు వడ్డీ భారంతో అప్పు 2 లక్షలు అయ్యిందని ఆయన ధ్వజమెత్తారు. కాంగ్రెస్ హయాంలో పంట భీమా ఇచ్చామని ఆయన గుర్తు చేశారు. కానీ తెలంగాణలో రైతుల్ని గాలికి వదిలేశారని, మోడీ రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా అని మోసం చేశారన్నారు. ఇప్పుడు రైతుల ఆదాయం సగానికి తగ్గిందన్నారు.రాహుల్ గాంధీ సభకు నల్గొండ నుండి భారీ ఎత్తున జనసమీకరణ చేస్తామని ఆయన వెల్లడించారు.