ఇటీవల ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ భాజపాను ఉద్దేశించి లండన్‌లో చేసిన తీవ్ర వ్యాఖ్యలపై కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఉనికి వెంటిలేటర్పై ఉంటే.. ఆ పార్టీ నేతల మూర్ఖత్వం యాక్సిలరేటర్‌పై ఉందంటూ సెటైర్ వేశారు. హజ్ ఓరియెంటేషన్ కార్యక్రమంలో భాగంగా ముక్తార్ అబ్బాస్ నఖ్వీ దిల్లీలో విలేకర్లతో మాట్లాడారు. కాంగ్రెస్ నేతలకు ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించడంపై ఉన్న మోజు మన దేశ పరువు తీసే కుట్ర స్థాయికి చేరుకుందని విరుచుకుపడ్డారు. ద్వేషాన్ని వ్యాప్తి చేయడమే భాజపా సిద్ధాంతమంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ముక్తార్ అబ్బాస్ నఖ్వీ .. కాంగ్రెస్ పార్టీ ఉనికి వెంటిలేటర్పై ఉంటే.. ఆ పార్టీ నేతల మూర్ఖత్వం యాక్సలరేటర్పై ఉందన్నారు.
ప్రతికూల ఫ్యూడల్ మనస్తత్వం కారణంగా కాంగ్రెస్ పార్టీ స్థానికంగా కూడా ఆమోదయోగ్యంగా ఉండలేకపోతోందని నఖ్వీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రమాదకరమైన భావజాలంతో పోరాడకుండా.. ఆ పార్టీలో నేతల ప్రమాదకర మూర్ఖత్వంతో పోటీ పడుతోందని వ్యాఖ్యానించారు. ఓ కుటుంబ ఫొటో ప్రేమ్లో స్థిరపడిపోయిన కాంగ్రెస్ పార్టీ.. ఓ నకిలీ కిట్టీ పార్టీగా పరిమితమైపోయిందని ఎద్దేవా చేశారు ముక్తార్ అబ్బాస్ నఖ్వీ. కాంగ్రెస్ నేతలు పరాయి దేశంలో మన దేశ పరువు తీస్తున్నారంటూ ఇటీవల యూకేలో రాహుల్ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతలు కొన్నిసార్లు భారత్‌ను పాకిస్థాన్, శ్రీలంక, ఇతర దేశాలతో పోలుస్తారని ముక్తార్ అబ్బాస్ నఖ్వీ అన్నారు.