మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్‌కు రంగం సిద్ధమవుతోంది. అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. గురువారం పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఎన్నికల సిబ్బందికి సామగ్రి పంపిణీ చేశారు. చండూరులోని డాన్‌బాస్కో జూనియర్ కళాశాలలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు చేశారు.
ఇవాళ ఉదయం 8 గంటల నుంచి ఎన్నికల సిబ్బందికి పోలింగ్ మెటీరియల్ పంపిణీ చేస్తున్నారు. మెటీరియల్ తీసుకుని తమకు కేటాయించిన పోలింగ్ స్టేషన్‌కు సిబ్బంది వెళ్తున్నారు. గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. నియోజకవర్గంలో మొత్తం 2,41,855 మంది ఓటర్లు ఉండగా.. వారిలో 1,21,720 మంది పురుషులు, 1,20,128 మంది స్త్రీలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రెండు వేల మంది పోలీసులతో గస్తీ ఏర్పాటు చేస్తున్నట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో మరింత పటిష్ఠ నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.