టాలీవుడ్‌లో వరుస విషాదాలో చోటు చేసుకుంటున్నాయి. ఆదివారం నాడు ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ మృతి చెందగా.. ఈ రోజు సీనియర్ నటుడు శరత్ బాబు(71) కన్ను మూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. సోమవారం నాడు ఆరోగ్యం విషమించడంతో మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. మల్టీపుల్ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ కావడం వల్ల కోలుకోలేక ఆయన మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. తెలుగుతో పాటు తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించారు.
ఆయన మృతిపై సీనియర్ నటుడు మురళీమోహన్ స్పందించారు. ఆసుపత్రిలో శరత్ బాబు భౌతికకాయాన్ని సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మనందరి అభిమాన నటుడు శరత్ బాబు మృతి చెందడం తీవ్ర విచారకరమని పేర్కొన్నారు. శరత్ బాబు బతకడం కష్టమని సందేహిస్తూనే ఉన్నామని, కానీ ఇంత త్వరగా వెళ్లిపోతాడని మాత్రం అనుకోలేదని వ్యాఖ్యానించారు.
తెలుగులోనే కాకుండా పలు ఇతర భాషల్లో కలిపి 250కి పైగా చిత్రాల్లో నటించారని, అలాంటి నటుడు ఇక లేడన్న నిజం జీర్ణించుకోలేకపోతున్నామని మురళీమోహన్ తెలిపారు.