మస్ట్ రీడ్: ఏపీలో “మోడీ క్లాసిఫైడ్స్”… సంప్రదించండి!

-

సాధారణంగా పత్రికల్లోనూ, ఆన్ లైన్ లలోనూ దర్శనమిచ్చే క్లాసిఫైడ్ యాడ్స్ ని ఏపీలో తనదైన శైలిలో ముద్రించబోతున్నారు మోడీ! అవును… “రాజమండ్రి రైల్వే స్టేషన్ అమ్మకానికి గలదు”.. “విజయవాడ విమానాశ్రయం ఫర్ సేల్”.. “తిరుపతి రైల్వే స్టేషన్ కొనాలనుకుంటున్నారా – సంప్రదించండి”.. “జాతీయ రహదారికి అతిచేరువలో ఉన్న నెల్లూరు రైల్వే స్టేషన్ అమ్మకానికి గలదు”! త్వరలో ఏపీలో దర్శనమివ్వబోయే మోడీ క్లాసిఫైడ్ ప్రకటనలు ఇవి!

నిజంగానే.. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఆస్తులన్నింటినీ అమ్మకానికి పెడుతున్నట్లుగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి ప్రకటించారు! కేంద్రప్రభుత్వానికి ఆస్తులేమిటి.. వాటిని అమ్మడం ఏమిటి అంటారా? కేంద్ర ప్రభుత్వానికంటూ ప్రత్యేకంగా ఆస్తులు ఏమీ ఉండవు.. ఆయా రాష్ట్రాల్లోని ఆస్తులను అడ్డంగా అమ్మేయడమే! ఇప్పుడు ఆ లిస్టులో ఏపీని పరిపూర్ణంగా చేర్చేయాలని నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం!

ఎవరు ఏమనుకున్నా.. ఎవరు అడ్డుకున్నా.. “ప్రభుత్వ ఆస్తులు ప్రైవేటు పరం” అనే కార్యక్రమాన్ని ఆపే ప్రసక్తి లేదని కేంద్రప్రభుత్వం పరోక్షంగా తేల్చి చెప్పింది. ఫలితంగా భవిష్యత్తులో భారతదేశం మొత్తాన్ని ఒక కార్పొరేట్ కంపెనీగా మార్చాలని.. కార్పొరేట్ శక్తుల కనుసన్నల్లో దేశభవిష్యత్తును పెట్టాలని మోడీ సర్కార్ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇప్పుడు కేంద్రప్రభుత్వం కన్ను ఏపీపై పడింది! విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఇప్పటికే తెగనమ్మాలని ఫిక్సయిన కేంద్రం… ఆ స్టీల్ ప్లాంట్ తోపాటు విజయవాడ, తిరుపతి, రాజమండ్రి విమానాశ్రయాలను, అనంతరం.. తిరుపతి, నెల్లూరు మొదలైన రైల్వే స్టేషన్స్ ని కూడా అమ్మేయాలని నిర్ణయించుకుంది!

ఇదే క్రమంలో విజయవాడ – చిలకలూరిపేట రోడ్డును కూడా అమ్మేయనున్నారు! అనంతరం విశాఖపట్నం పోర్టులోని నాలుగు ప్రాజెక్టులను కూడా అమ్మకానికి పెట్టనుంది మోడీ సర్కార్. ఫలితంగా వేలకోట్లో లక్ష కోట్లో సమకూర్చుకోవాలని కేంద్రం భావిస్తుంది. ఇన్ని అమ్మేస్తున్నారుగా.. మరి విశాఖ ఎయిర్ పోర్ట్ ను ఎందుకు వదిలేశారయ్యా అంటే… అది దేశభద్రతా పరంగా వ్యూహాత్మక ఎయిర్‌ పోర్టు. అందుకే విశాఖను మాత్రం వదిలేశారు. లేదంటే… “విశాఖ విమానాశ్రయం అమ్మకానికి గలదు” అంటూ క్లాసిఫైడ్స్ లో ప్రకటన చూసేవారే!

అయితే… ఇలా రాష్ట్ర ప్రభుత్వాల ఆస్తులన్నీ కేంద్రం అమ్మేస్తుందంటే అసహ్యంగా ఉంటుందని భావించిన కేంద్రం.. ఈ అమ్మకానికి ఒక అందమైన పేరు పెట్టింది. అదే “మానిటైజేషన్”! అంటే 50 ఏళ్లకో, 99 ఏళ్లకో ప్రైవేటు వ్యక్తులకు లీజుకు ఇస్తారన్నమాట! అలా తరాలకు తరాలు లీజులకు ఇవ్వడానికి, అమ్మడానికీ పెద్ద తేడా ఏమిటో మోడీనే చెప్పాలి. దానికీ దీనికి పెద్ద తేడా ఉండదన్న విషయం ప్రజలకు తెలియదు అనేది వారి నమ్మకం కావొచ్చు! తెలిసినా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఏమీ అడ్డుచెప్పవనేది వారి ధైర్యం అయ్యి ఉండవచ్చు!

సో… ఏపీలో త్వరలో రాబోయే ఈ “మోడీ క్లాసిఫైడ్స్” ప్రకటనలను చూసి… ఆసక్తిగలవారు సంప్రదించవచ్చు. సంప్రదించవలసిన వ్యక్తులు… “నరేంద్ర మోడీ” – ప్రధాన మంత్రి, “అమిత్ షా” – కేంద్ర హోం మంత్రి, “నిర్మళా సీతారామన్” – కేంద్ర ఆర్థిక మంత్రి, న్యూ ఢిల్లీ!

Read more RELATED
Recommended to you

Latest news