పేదల గృహ నిర్మాణంలో అనేక అక్రమాలు, అవకతవకలు చోటుచేసుకున్నాయన్నారు జనసేన రాజకీయ వ్యవహారాల కార్యదర్శి నాదెండ్ల మనోహర్. తాజాగా ఆయన మాట్లాడుతూ.. ఇళ్ల స్థలాల కోసం సేకరించిన భూమి లావాదేవీల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. పది నుంచి 20 లక్షలు విలువ చేయని భూములను చేతులు మార్చి రూ. 70 లక్షలదాకా చెల్లించారన్నారు. జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల్లేవని, లబ్దిదారులకు నరకం చూపిస్తున్నారన్నారు నాదెండ్ల మనోహర్. ‘కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించింది. అందుకే ఈ నెల 12 నుంచి 14 దాకా జగనన్న కాలనీలను క్షేత్ర స్థాయిలో జన సైనికులు పరిశీలిస్తారు. వాస్తవాలను ప్రతిబింబిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడతాం. హ్యాష్‌ట్యాగ్‌తో ‘జగనన్న మోసం’ ఇదేనంటూ ప్రజలకు వివరిస్తాం..” అంటూ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.
ఈ నేపథ్యంలో పేదల గృహ నిర్మాణాలపై క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను ఒకసారి చూద్దాం… వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చిన వెంటనే నవరత్నాల్లో ప్రధానమైన పేదల గృహ నిర్మాణంపై దృష్టి పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు నిర్ణయించారు. కొన్నిచోట్ల తలెత్తిన సమస్యల కారణంగా సుమారు 26 లక్షల మందికి మాత్రమే ఇళ్ల స్థలాలు మంజూరు చేసింది. అందులో 17 జగనన్న కాలనీల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది జూన్ నాటికి మొత్తం 18,63,552 ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని హామీనిచ్చింది. ఇప్పటిదాకా 52 వేల ఇళ్లను మాత్రమే పూర్తి చేయగలిగింది. క్షేత్ర స్థాయిలో అనేక ఇబ్బందులు తలెత్తాయి. ఎప్పటికప్పుడు వాటిని దాటుకుంటూ ఎలాగైనా తాము మాత్రమే ఇన్ని లక్షల ఇళ్లు కట్టించి ఇచ్చామని చెప్పుకునేందుకు ప్రభుత్వం తహతహలాడుతోంది.