ఇకనైనా మనుషులుగా మారండి…చంద్రబాబు కంటతడి పెట్టడం పై నాగబాబు ఫైర్..!

చంద్రబాబు కంటతడి పెట్టడం పై జనసేన నాయకులు, నటుడు నాగబాబు స్పందించారు. రాష్ట్ర చరిత్రలోనే ఇది దుర్దినం అని నాగబాబు అన్నారు. ఎంతో ఉన్నతమైనది గా ఉత్తమమైనదిగా ప్రాచుర్యం పొందిన మన రాష్ట్ర భవిష్యత్తును తలుచుకుని బాధ పడాలో లేకపోతే భయపడాలో తెలియని సందిగ్ధ పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు తమకు ప్రత్యర్థి అయి ఉండొచ్చు తమకు ప్రతిపక్షం అయి ఉండొచ్చని కానీ చంద్రబాబు లాంటి ఒక నేత కంటతడి పెట్టడం తనను ఎంతో దిగ్భ్రాంతికి గురి చేసిందని నాగబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్ర రాష్ట్ర రాజకీయం రోజురోజుకు పరాకాష్టకు నిలయం గా మారుతుందని మండిపడ్డారు.

ఒక ముఖ్యమంత్రిని బోసిడికే అని దూషించి… ఒక మాజీ ముఖ్యమంత్రి కుటుంబాన్ని అసభ్య పదజాలంతో కించపరిచి తమను తాము విలువలు లేని పురుగులుగా నాయకులు నిరూపించుకున్నారని నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరిని విమర్శించే నైతిక హక్కు ఉంది తప్ప వారిని తిట్టడం లేదా దూషించే అధికారం లేదని అన్నారు. గతంలో తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ను తన కుటుంబాన్ని కూడా ఇలానే అసభ్య పదజాలంతో విమర్శించారని అప్పుడు ఎంతో క్షోభ కు గురైనట్లు… ఆ బాధను అనుభవించిన వ్యక్తిగా చెబుతున్నానని నాగబాబు అన్నారు.