టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, ఈ ఉగాదితో శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. “మన సంస్కృతి, సంప్రదాయ పండగ ఉగాది సందర్భంగా శుభాకాంక్షలు. శోభకృత్ నామ సంవత్సరం అందరికీ శుభాలు కలగజేయాలి. తెలుగు లోగిళ్లు కొత్త శోభ సంతరించుకోవాలి. కొత్త ఆశయాలు నెరవేరి సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో నవ్యోత్సాహంతో ఉగాది జరుపుకోవాలి” అని తెలిపారు నారా లోకేశ్.
ఇక బాల కృష్ణ మాట్లాడుతూ, రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలందరితోపాటు దేశవిదేశాల్లోని తెలుగువారందరికీ ‘‘ఉగాది’’ పర్వదిన శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. ఈ తెలుగు సంవత్సరాది ప్రతి తెలుగువాడికీ నిత్య ‘శోభకృతం’ కావాలని అన్నారు బాల కృష్ణ. “శ్రీ శుభకృత్ శుభాలను మననం చేసుకోండి, ఎదురైన అశుభాలను మరిచిపోండి. రాబోయే శ్రీ శోభకృత్ స్ఫూర్తిని గుండెల్లో నింపుకోండి. ప్రతిఒక్కరికీ శ్రీ శోభకృత్ నిత్య శోభాయమానం కావాలి. గత విజయాల స్ఫూర్తితో, భావి విజయ పరంపర వైపు దూసుకెళ్లాలి. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లన్న పూజ్యుల ప్రబోధమే మనందరి బాట” అని వెల్లడించారు నందమూరి బాల కృష్ణ.