సోమవారం టిఎన్ఎస్ఎఫ్ మేధోమదన సదస్సులో నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ క్రమంలోనే వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అలాగే ఆ తర్వాత ట్విటర్ వేదికగా కూడా విమర్శల వర్షం కురిపించారు. ‘‘ఎవరైనా మీ నాన్న ఎవరు అని తెలుగులో అడుగుతారు, అలాగే హూ ఈజ్ యువర్ ఫాదర్ అని ఇంగ్లీష్‌లో అడుగుతారు.. కానీ వైసీపీ భాషలో నీ అమ్మ మొగుడు ఎవరు అని అడుగుతారు’’అని టీడీపీ నేత నారా లోకేష్ అన్నారు. టీడీపీ హయాంలో 9.5 లక్షల ఉద్యోగాలు వచ్చాయని అసెంబ్లీలో ఒప్పుకున్నారని అన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక వైసీపీ కార్యకర్తలకే ఉద్యోగాలు వచ్చాయని ఆరోపించారు.
రాష్ట్రం నుంచి కంపెనీలను తరిమేశారని, తమిళనాడు ప్రభుత్వంతో కియా కంపెనీ ప్రతినిధులు చర్చలు జరిపారన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ భృతి ఎత్తేశారని.. ఫీజు రీయింబర్స్‌మెంట్ లేదని లోకేష్ తీవ్రస్థాయిలో విమర్శించారు. మరోవైపు ట్విటర్ ఖాతాలో తొమ్మిది నెలల తుగ్లక్ పాలనలో యువతకు జరుగుతున్న అన్యాయం గురించి ఈ సదస్సులో చర్చించామని, మూడు రాజధానుల పేరుతో కంపెనీలను తరిమేస్తూ యువత ఉద్యోగావకాశాలను సీఎం జగన్ దెబ్బతీస్తున్నారని విమర్శిస్తూ ట్విట్ చేశారు. ఈ క్రమంలోనే ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని విద్యార్థి లోకానికి తెలియజేసేలా కార్యాచరణ రూపొందించుకోవాలని మార్గనిర్దేశం చేసినట్టు లోకేశ్ తెలిపారు.