మరోసారి వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్. ఆయన మాట్లాడుతూ.. తనపైనా, తెలుగుదేశం అధినేత చంద్రబాబుపైనా, ఆరోపణలు చేయడం, పారిపోవడం ఏ1, ఏ2 లకు అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఐదేళ్ల పాలనలో ఒక్క తప్పూ చేయలేదని స్పష్టం చేశారు లోకేశ్. ఇప్పటిదాకా ఏ ఆరోపణ అయినా నిరూపించగలిగారా? అని లోకేశ్ ప్రశ్నించారు. మంగళగిరి నియోజకవర్గం నిడమర్రులో నిర్వహించిన ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో లోకేశ్ పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు లోకేశ్. తమ ఇళ్ల కూల్చివేతకు నోటీసులు ఇచ్చారని మహిళలు గోడు వెళ్లబోసుకోగా, న్యాయపోరాటం చేసి అండగా నిలుస్తానని లోకేశ్ భరోసా ఇచ్చారు. ఎన్నికలకు ముందు తనపై అనేక ఆరోపణలు చేశారని, అధికారంలోకి వచ్చి కూడా అనేక ఆరోపణలు చేస్తున్నారని… దమ్ముంటే ఏ ఒక్క ఆరోపణ అయినా నిరూపించాలని సవాల్ విసిరారు.
స్కిల్ డెవలప్ మెంట్ స్కాం అంటూ ఆరోపణలు చేస్తున్న ప్రభుత్వం 24 గంటల్లో ఆధారాలు చూపాలని ఛాలెంజ్ చేస్తే పారిపోయిందని ఎద్దేవా చేశారు లోకేశ్. “నాడు పింక్ డైమండ్ అన్నారు, దసపల్లా భూములు కొట్టేశానన్నారు. అగ్రిగోల్డ్ నేనే చేశానన్నారు, ఫైబర్ గ్రిడ్ లోనూ ఆరోపణలు చేశారు. కానీ జగన్ రెడ్డి గ్యాంగ్ ఒక్క ఆరోపణ కూడా నిరూపించలేకపోయింది” అని వివరించారు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్ల అయ్యిందని, 50 మంది టీడీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టారని, ఒక్క కేసు అయినా నిలబడిందా? అని నిలదీశారు. నెలకి ప్రజాధనం లక్షలు బొక్కుతున్న సాక్షి జీతగాడు సజ్జల ఏ అర్హత, ఏ హోదాతో తెలుగుదేశం నేతలపై ఆరోపణలు చేస్తున్నాడో చెప్పాలన్నారు. తాడేపల్లి కొంప నుంచి ఇచ్చే కాగితం పట్టుకుని తప్పుడు ఆరోపణలు చేసే వారందరిపైనా పరువునష్టం కేసు వేస్తానని లోకేశ్ హెచ్చరించారు.