మరోసారి వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్. ర్యాలీలు, సభలపై నిషేధం విధించిన ముఖ్యమంత్రి జగన్ పై నారా లోకేశ్ మండిపడ్డారు. తమ నాయకుడు చంద్రబాబు ఇంట్లోంచి బయటకు రాకూడదని ఇంటి మీదే దాడి చేశావని, ఆయనని ఆపలేకపోయావని అన్నారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తల్ని దూరం చేయాలని కేంద్ర కార్యాలయాన్ని ధ్వంసం చేయించావని… తెలుగుదేశం కుటుంబసభ్యుల వెల్లువని అడ్డుకోలేకపోయావని చెప్పారు. టీడీపీ సభలకి వెళ్తే పథకాలు రద్దు చేస్తామని బెదిరిస్తే మూలనున్న ముసలమ్మ కూడా బెదరడంలేదని ఎద్దేవా చేశారు నారా లోకేశ్.
నీ రాక్షసపాలనకి చరమగీతం పాడేందుకు రాయలసీమ సమరశంఖం పూరించిందని… వైసీపీని ఉత్తరాంధ్ర ఉప్పెనలా ముంచెత్తబోతోందని… కోస్తా నీ సర్కారుకి కొరివి పెట్టనుందని అన్నారు. చంద్రబాబు సభలను అడ్డుకోవాలనే కుతంత్రాన్ని పన్నారనే విషయం మీరు తెచ్చిన చీకటి జీవోయే చెబుతోందని విమర్శించారు నారా లోకేశ్ . అణచివేత అధికమైతే తిరుగుబాటు తీవ్రం అవుతుందనే చారిత్రక సత్యం నీలాంటి మూర్ఖుడికి అధికారాంతమునే అర్థం అవుతుందని వ్యాఖ్యానించారు. జీవోని మడిచి పెట్టుకోవాలని… జన సునామీని దమ్ముంటే తట్టుకోవాలని నారా లోకేశ్ అన్నారు.