తెలుగుదేశ పార్టీ నేడు తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని వేమగిరి వద్ద టీడీపీ మహానాడు ఘనంగా ప్రారంభించింది. అయితే.. ఇవాళ ప్రతినిధుల సభకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, గతంలో కొందరు స్వార్థంతో పార్టీని వీడి వెళ్లిపోయారని, ఇలాంటి వాళ్లు ఇప్పుడు తిరిగి వస్తామన్నా తమకు అవసరం లేదని సభాముఖంగా ప్రకటించారు లోకేశ్. వెళ్లిపోయిన వారి స్థానంలో కొత్త తరం నేతలను తయారుచేసుకుంటామని లోకేశ్ అన్నారు. పార్టీలో కష్టపడి పనిచేసేవారికే గుర్తింపు ఉంటుందని, ఈ నియమం తనతో సహా అందరు నేతలకు వర్తిస్తుందని లోకేశ్ స్పష్టం చేశారు.
నియోజకవర్గాల ఇన్చార్జిల ప్రకటన చేసినంత మాత్రాన టికెట్లు వచ్చినట్టేనని భావించవద్దని, పనిచేయని వారికి టికెట్లు రావని తేల్చి చెప్పారు లోకేశ్. పార్టీ అధిష్ఠానం నాయకుల సామర్థ్యం మేరకే టికెట్లను నిర్ణయిస్తుందని వివరించారు లోకేశ్. సెంటు భూమి విలువ పెరగాలంటే చంద్రబాబు రావాలనే భావన ఉందని లోకేశ్ అభిప్రాయపడ్డారు. యువతకు ఉద్యోగాలు రావాలంటే టీడీపీ రావాలని కోరుకుంటున్నారని తెలిపారు. ఆర్-5 జోన్ లో త్వరగా ఇళ్లు నిర్మించాలనడం కోర్టు తీర్పునకు విరుద్ధం అని విమర్శించారు. జగన్ హయాంలో ఇళ్లు నిర్మించుకున్నవారు అప్పుల ఊబిలో మునిగారని చెప్పారు. రాయలసీమ అభివృద్ధికి త్వరలోనే రూట్ మ్యాప్ ప్రకటిస్తానని లోకేశ్ వెల్లడించారు. తాగునీరు, సాగునీరు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలపై రూట్ మ్యాప్ ఉంటుందని వివరించారు. మహానాడు వేదికగా రేపు యువతకు శుభవార్త చెబుతామని తెలిపారు.