వైసీపీ పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాలకు అన్యాయమే జరుగుతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలం నలగామపల్లిలో యువగళం’ పాదయాత్ర రెండో రోజులో ఆయన మాట్లాడారు. యాత్రలో భాగంగా ప్రజల విజ్ఞప్తులను లోకేశ్ స్వీకరిస్తున్నారు. మధ్యలో నిర్మాణాలు నిలిపివేసిన కురుబ, వాల్మీకి వర్గాలకు చెందిన సామాజిక భవనాలను ఆయన పరిశీలించారు. ఈ భవనాలను పూర్తి చేయాలని కోరినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు లోకేశ్ దృష్టికి తీసుకొచ్చారు.
‘‘’వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వివిధ వర్గాల ప్రజలకు రుణాలు, రాయితీలు ఏమైనా ఇచ్చారా? టీడీపీ హయాంలో అన్ని వర్గాల ప్రజలను ఆదుకున్నాం. సామాజిక న్యాయం గురించి వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. కానీ, వారు చేసేది మాత్రం సామాజిక అన్యాయమే.. చెప్పేది ఒకటి.. చేసేది మరొకటి.. మొదట మనలో చైతన్యం రావాలి. ప్రజలకు కావాల్సినవి చేసే బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉంది. రేపు వస్తారుగా ఓట్లు అడిగేందుకు. అప్పుడు నిలదీద్దాం’’’ అని లోకేశ్ అన్నారు.