అమరావతి ఉద్యమం 300 రోజుకు చేరుకుందని, కేసులకు భయపడకుండా, కరోనాను లెక్క చేయకుండా ఉద్యమం లో పాల్గొన్న పెద్దలు, మహిళల కు నా నమస్కారాలు అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఇక్కడే రాజధాని ఉండాలని ఈ ప్రాంత ప్రజలు ఎవరూ కోరుకోలేదు అని ఆయన పేర్కొన్నారు. అన్ని ప్రాంతాలకు సమ దూరం ఉండాలని, 30వేల ఎకరాలు కావాలని జగన్ రెడ్డి ఆనాడు చెప్పలేదా అని నిలదీశారు.
అధికారంలోకి వస్తే… ఇంకా మరింత బాధ్యత తో జగన్ రెడ్డి ఉండాలి అని అన్నారు. మరి జగన్ రెడ్డి మూడు రాజధానల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టారని మండిపడ్డారు. అమరావతి లో ఒకే కులం అని అసత్యాలు ప్రచారం చేశారు అని, అన్ని కులాలు, మతాల సమ్మేళనమే రాజధాని అమరావతి అని అన్నారు. ఇంత వరద వచ్చింది.. ఎక్కడైనా ఒక్క ఎకరా మునిగిందా అని ప్రశ్నించారు. నేడు ఇలా రోడ్డెక్కి పోరాటం చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని అన్నారు. జగన్ కు అనేక భవంతులు ఉన్నా… అమరావతి లో కట్టుకుని ఇక్కడే ఉంటామని నమ్మించారని, 300రోజులుగా సాగుతున్న ఉద్యమానికి అందరూ మద్దతు ఇవ్వాలని, ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని అని జగన్ అనే వరకు పోరు ఆగకూడదని అన్నారు.