ఒడిశా రాష్ట్రం బాలాసోర్ వద్ద కోరమండల్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదానికి గురైన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతుంది. రైలు ప్రమాదంలో గాయపడిన బాధితులకు అందుతున్న వైద్య సహాయాన్ని పరిశీలించడానికి తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ భువనేశ్వర్ లోని ఏమ్స్, కటక్ లోని మెడికల్ కాలేజీని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఘటనలో వెయ్యి మందికి పైగా గాయపడ్డారని.. వారికి చికిత్స కొనసాగుతుందని తెలిపారు.
అయితే గాయపడ్డ వారిలో వందమందికి పైగా క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. వారికోసం ఢిల్లీ ఎయిమ్స్, ఆర్ఎంఎల్ ఆసుపత్రుల నుంచి వైద్య నిపుణులు, పరికరాలు, మెడిసిన్స్ తెప్పించామని తెలిపారు. కాగా ఈ ఘటనలో ఇప్పటివరకు 294 మంది మరణించినట్లు సమాచారం. గాయపడ్డ వారిలో కొందరికి ఆపరేషన్ అవసరం ఉందని తెలిపారు కేంద్ర మంత్రి. తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు.