పార్లమెంట్ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే కీలక నేతలు ఆ పార్టీని వీడుతుండగా.. తాజాగా పంజాబ్ లోని లూథియానాకు చెందిన కాంగ్రెస్ ఎంపీ రవనీత్ సింగ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం మంగళవారం సాయంత్రం ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో ఆయన కాషాయ పార్టీలో చేరారు. రవీత్ సింగ్ బిట్టు 2009 నుండి 2014 వరకు పంజాబ్లోని ఆనంద్పూర్ సాహిబ్ లోక్సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. అలాగే 2014, 2019 నుంచి లూథియానా ఏంపీగా కొనసాగుతున్నారు.
కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరిన సందర్భంగా రవ్నీత్ సింగ్ బిట్టు మాట్లాడుతూ.. ‘నేను పంజాబ్ సమస్యలను లేవనెత్తినప్పుడల్లా ప్రధాని, హోంమంత్రి సానుకూలంగానే తీసుకుంటారు. పంజాబ్ ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాం.. దేశం వేగంగా అభివృద్ధి చెందుతుంటే.. పంజాబ్ మాత్రం ఎందుకు వెనుకబడాలి.. తన నా రాష్ట్రాన్ని కూడా ప్రధాని మోడీ నాయకత్వంలో అభివృద్ధి చేసుకుంటానని చెప్పుకొచ్చారు. కాగా రవ్నీత్ సింగ్ మొదటి నుంచి ఖలిస్తాని ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన బీజేపీలో చేరడం తో.. కాంగ్రెస్, ఆప్ పార్టీలు చిక్కుల్లో పడనున్నాయి.