పెగాసెస్‌పై సీఎం మమత న్యాయ విచారణకు ఆదేశం

-

పెగాసెస్ ఫోన్ హ్యాకింగ్ స్కాండల్‌పై పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ న్యాయ విచారణకు ఆదేశించారు. ఇందుకోసం రిటైర్డ్ జడ్జీలు జస్టిస్ జ్యోతిర్మయి భట్టాచార్య, జస్టిస్ మదన్‌ బి లోకూర్‌లో కమిటీని ఏర్పాటు చేశారు. పెగాసెస్ నిఘా లక్షిత జాబితాలో మమత మేనల్లుడు, ఎంపీ అభిషేక్ బెనర్జీ పేరు కూడా ఉన్నట్టు వెల్లడైన తర్వాతి రోజే పశ్చిమబెంగాల్ సీఎం విచారణకు ఆదేశించడం గమనార్హం.

ఇజ్రాయెల్‌‌కు చెందిన ఎన్‌ఎస్ఓ గ్రూప్ పెగాసెస్‌ స్పైవేర్ రూపొందించింది. ఈ స్పైవేర్‌ను ఉపయోగించి 2017 నుంచి 2019 మధ్యకాలంలో వందల కొద్దీ ప్రతిపక్ష పార్టీల నేతలు, జర్నలిస్టులు, ప్రభుత్వ అధికారులు, రాజ్యాంగబద్ధ సంస్థల అధిపతుల ఫోన్లను హ్యాకింగ్ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. వీటిపై విచారణ జరపడం కోసం పశ్చిమబెంగాల్ సీఎం విచారణకు ఆదేశించడం కీలక పరిణామం. పెగాసెస్ స్పైవేర్‌పై విచారణకు ఆదేశించడం దేశంలో ఇదే తొలిసారి.

ఫోన్ హ్యాకింగ్ వ్యవహారంపై కోర్టు పర్యవేక్షణలో విచారణ కమిటీ లేదా స్వతంత్ర ఎంక్వైరీ కమిషన్‌ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని భావించాం. కానీ, నరేంద్ర మోడీ ప్రభుత్వం అలాంటి చర్యలు ఏమి చేపట్టలేదు. ఈ నేపథ్యంలో పెగాసెస్ ఫోన్ హ్యాకింగ్‌పై విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం’ అని సీఎం మమత తెలిపారు.

నేను తీసుకున్న చిన్నపాటి చర్యలు మిగతా వారిని మేలు కొలుపుతాయని భావిస్తున్నా. అతి త్వరలో మేం విచారణను ప్రారంభిస్తాం. పశ్చిమబెంగాల్‌కు చెందిన చాలా మంది ఫోన్లు ట్యాప్ చేశారని మమతా బెనర్జీ ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news