రాజ్యసభ ఎన్నికల్లో బిజెపి సత్తా చాటింది. కేంద్ర ఎన్నికల సంఘం దేశంలోని 15 రాష్ట్రాల్లోని 57 స్థానాలకు ఎన్నికలు షెడ్యూల్ ప్రకటించగా.. వాటిలో 41 స్థానాలు ఏకగ్రీవం కావడంతో నాలుగు రాష్ట్రాల్లో మిగిలిన 16 స్థానాలకు శుక్రవారం ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల్లో ఈ ఎన్నికలు జరిగాయి. మహారాష్ట్రలో మొత్తం ఆరు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగగా.. అధికార మహావికాస్ అఘాడీకి అనుకున్నంత మేర సీట్లు దక్కలేదు.
ఆరు స్థానాలకు మూడు స్థానాల్లో బిజెపి గెలిచింది. మహారాష్ట్ర నుంచి ఆ పార్టీ తరఫున రాజ్యసభకు కేంద్రమంత్రి పియూష్ గోయల్, అనిల్ బోండే, ధనంజయ్ మహాదిక్ ఎన్నికయ్యారు. శివసేన నుంచి సంజయ్ రౌత్, ఎన్సీపీ నుంచి ప్రపుల్ పటేల్ రాజ్యసభకు వెళ్తున్నారు. కాంగ్రెస్ నుంచి ప్రతాప్ గర్హి ఎన్నికయ్యారు. కర్ణాటకలో నాలుగు స్థానాలకు గాను మూడు స్థానాల్లో బీజేపీ విజయదుందుభి మోగించింది. పదహారు స్థానాలకు ఎన్నికలు జరగగా ఎనిమిది స్థానాల్లో బీజేపీ విజయకేతనం ఎగురవేసింది.