యూట్యూబ్‌లో వీడియోలు చూసి అచ్చం అలాగే చేయడం చాలా మందికి అలావాటైపోయింది. ముఖ్యంగా చిన్నపిల్లలు ఇంటర్నెట్ కు అలవాటు పడి వీడియోల్లో ఎలా చేస్తే వాళ్లూ అలాగే చేయడం నేర్చుకుంటున్నారు. పేపర్ బోట్ నుంచి బాంబుల వరకు యూట్యూబ్ లో చూసి నేర్చుకుంటున్నారు. అలా యూట్యూబ్ లో వైన్ తయారు చేయడం చూసిన ఓ 12 ఏళ్ల బాలుడు ద్రాక్ష పండ్లతో తానూ వైన్ తయారు చేశాడు.
తాను తయారు చేసిన వైన్‌ను తన మిత్రుడికి ఇవ్వగా.. అది తాగిన అనంతరం అతడు అస్వస్థతకు గురయ్యాడు. వాంతులు చేసుకొని ఆస్పత్రిలో చేరాడు. ఈ ఘటన కేరళ తిరువనంతపురం చిరాయింకీజులో శుక్రవారం జరిగింది.
కల్తీ మద్యం తాగిన బాలుడ్ని చిరాయింకీజులోని ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడని పోలీసులు తెలిపారు. వైన్ బాటిల్‌ను స్థానిక కోర్టు అనుమతితో పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపారు పోలీసులు. వైన్‌లో మరేదైనా ఆల్కహాల్ కలిపినట్లు, ఇంకేదైనా రసాయనాలు కలిపినట్లు తేలితే బాలుడిపై కేసు కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.
తన తల్లిదండ్రులు కొనుగోలు చేసిన ద్రాక్ష పండ్లతోనే మద్యం తయారు చేశానని బాలుడు చెప్పాడు. అందులో ఏం రసాయనాలు కలపలేదని తెలిపాడు. యూట్యూబ్‌లో చూపించిన విధంగానే వైన్ తయారు చేసి.. కొన్ని గంటలు భూమిలో పాతిపెట్టినట్లు వివరించారు. ఆ తర్వాత స్నేహితుడికి ఇచ్చినట్లు చెప్పాడు.