ఈ నెల 29న ప్రగతిభవన్లో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం కానుంది. సీఎం కేసిఆర్ అధ్యక్షతన.. మధ్యాహ్నం ఒంటిగంటకు ఈ సమావేశం నిర్వహించనున్నారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో.. పార్లమెంటులో చర్చించాల్సిన అంశాలు, అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. ఇదే అంశంపై పార్టీ ఎంపీలకు ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేయనున్నారు.
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31 నుంచి ప్రారంభంకానున్నాయి. రెండు విడతల్లో ఏప్రిల్ 6వ తేదీ వరకు సాగుతాయి. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ట్విటర్ ద్వారా వెల్లడించారు. తొలి రోజు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగిస్తారు. ఆ వెంటనే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను పార్లమెంటు ముందుంచుతారు. రెండో రోజైన ఫిబ్రవరి 1న 2023 కేంద్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి సమర్పిస్తారు.