భాజపా-జేడీ(యూ) బంధం తెగిపోవడంతో బిహార్‌లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. ముఖ్యమంత్రి పదవికి నీతీశ్ కుమార్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను గవర్నర్‌కు అందజేసిన తర్వాత ఆయన నేరుగా ఆర్జేడీ చీఫ్ లాలూ నివాసానికి వెళ్లి తేజస్వీ యాదవ్‌తో భేటీ అయ్యారు. ఆర్జేడీ, కాంగ్రెస్ ఇతర పార్టీలతో కలిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు దిశగా జోరుగా పావులు కదుపుతున్న నేపథ్యంలో అక్కడ జరుగుతున్న రాజకీయ పరిణామాలపై లోక్‌జనశక్తి పార్టీ (రాం విలాస్ వర్గం) నేత చిరాగ్ పాసవాన్ స్పందించారు.
ఆర్జేడీతో నీతీశ్ చేతులు కలపడంపై మండిపడ్డారు. బిహార్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. నీతీశ్ విశ్వసనీయత కోల్పోయారని.. వచ్చే ఎన్నికల్లో జేడీ(యూ)కి సున్నా సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు. పట్నాలో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఈరోజు నీతీశ్ విశ్వసనీయత సున్నా. బిహార్‌లో రాష్ట్రపతి పాలన విధించాలి. కొత్తగా ప్రజా తీర్పు కోరాలి. నీతీశ్.. మీకు ఏమైనా సిద్ధాంతం ఉందా లేదా? వచ్చే ఎన్నికల్లో జేడీ(యూ)కి సున్నా సీట్లే వస్తాయి’’ అని వ్యాఖ్యానించారు.
2020 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీ(యూ) ఓటమే లక్ష్యంగా అభ్యర్థులను నిలిపిన లోక్‌జనశక్తి అధ్యక్షుడు చిరాగ్‌కు భాజపా పెద్దల ఆశీర్వాదం ఉందని నీతీశ్ బలంగా విశ్వసిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల పట్నాలో భాజపా సమావేశంలో చిరాగ్ ప్రత్యక్షం కావడం వంటి కారణాలు కమలనాథుల వ్యూహాలపై నీతీశ్‌లో అనుమానాలు రేకెత్తడం కూడా భాజపా-జేడీయూ బంధానికి బీటలు రావడానికి కారణాలుగా విశ్లేషణలు వస్తున్నాయి.