కరోనా వ్యాప్తి దేశ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలోనే ఉంది. గత కొద్ది రోజుల నుంచి కరోనా వ్యాప్తి కాస్త తగ్గినా.. ప్రతిరోజు మూడు లక్షలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. కరోనా వ్యాప్తి ప్రభావం పార్లమెంట్ పై కూడా పడింది. ఇప్పటికే పార్లమెంట్ లో ఇప్పటికే దాదాపు 900 కు పైగా కరోనా కేసులు వెలుగు చూశాయి. అంతే కాకుండా భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు కూడా కరోనా సోకింది. వరుసగా పాజిటివ్ కేసులు రావడం బడ్జెట్ సమావేశాలపై ప్రభావం పడింది. బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్నాయి.
అయితే కరోనా వ్యాప్తి కారణంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెండు వేర్వేరు సమయాల్లో లోక్ సభ, రాజ్య సభ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు రాజ్య సభ సమావేశం జరగనున్నాయి. అలాగే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు లోక్ సభ సమావేశాలను నిర్వహించనున్నారు.
అలాగే బడ్జెట్ సమావేశాల్లో భాగంగా తొలి రోజు ఉదయం 11 గంటలకు పార్లమెంట్ లోని సెంట్రల్ హాల్ రాష్ట్ర పతి రామ్ నాథ్ కోవింద్ ఉభయ సభలను ఉద్ధేశించి ప్రసంగిస్తారు. అనంతరం ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. కాగ కరోనా వ్యాప్తి కారణంగా రాజ్య సభ, లోక్ సభ, సెంట్రల్ హాల్ లో సభ్యులు భౌతిక దూరం పాటించేలా సీట్లను అందుబాటులో ఉంచారు.