2020-21 విరాళాలు.. తెరాస ఖాతాలో ఎన్ని కోట్లంటే..?

-

దేశంలో 2020-21 ఆర్థిక సంవత్సరానికిగాను ప్రాంతీయ రాజకీయ పార్టీలు దక్కించుకున్న మొత్తం విరాళాల్లో 91% పైగా నిధులు (రూ.113.79 కోట్లు) ఐదు పార్టీల ఖాతాల్లోకే వెళ్లాయి. ఇందులో తెలంగాణ ఐదో స్థానంలో ఉంది. మొదటి నాలుగు స్థానాల్లో.. జనతాదళ్‌ యునైటెడ్‌ (జేడీయూ), ద్రవిడ మున్నేట్ర కళగం (డీఎంకే), ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌), ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ (ఐయూఎంఎల్‌) ఉన్నాయి.

అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) రూపొందించిన తాజా నివేదికలో ఈ మేరకు వివరాలు వెల్లడయ్యాయి. 2020-21లో తమకు అందిన విరాళాలపై ప్రాంతీయ పార్టీలు ఎన్నికల సంఘానికి అందించిన సమాచారం ఆధారంగా ఏడీఆర్‌ ఈ నివేదికను తయారుచేసింది. అందులోని వివరాల ప్రకారం..

2020-21లో 27 ప్రాంతీయ పార్టీలకు కలిపి 3,051 విరాళాల ద్వారా రూ.124.53 కోట్లు అందాయి. అందులో ఐదు పార్టీల వాటాయే రూ.113.79 కోట్లు. అత్యధికంగా జేడీయూకు రూ.60.15 కోట్లు (330 విరాళాలు) వచ్చాయి. తర్వాతి స్థానాల్లో డీఎంకే (రూ.33.99 కోట్లు), ఆప్‌ (రూ.11.32 కోట్లు), ఐయూఎంఎల్‌ (రూ.4.16 కోట్లు), తెరాస (రూ.4.15 కోట్లు) ఉన్నాయి.

2019-20తో పోలిస్తే తమకు విరాళాలు పెరిగినట్లు జేడీయూ, డీఎంకే, తెరాస ప్రకటించాయి. తమకు ఆ సొమ్ము రాక తగ్గినట్లు ఆప్‌, ఐయూఎంఎల్‌ వెల్లడించాయి. డీఎంకే, తెరాస, జేడీయూ, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్‌)లకు వచ్చిన విరాళాల శాతం 2019-20తో పోలిస్తే గణనీయంగా పెరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news