కరోనా బారిన పడిన వారికి వివిధ రకాల ట్యాబ్లెట్లతో చికిత్సను అందిస్తున్న విషయం విదితమే. కోవిడ్ స్వల్ప, మధ్యస్థ లక్షణాలు ఉన్నవారు హోం ఐసొలేషన్‌లో ఉండి తమకు ఉన్న లక్షణాలను బట్టి మందులను వాడుతున్నారు. ఇక హాస్పిటళ్లలో కోవిడ్ పేషెంట్లకు రెమ్‌డెసివిర్‌తోపాటు స్టెరాయిడ్లు ఇతర మందులను ఇస్తున్నారు. అయితే కరోనా ప్రభావాన్ని మరింత తగ్గించడానికి గోవా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
గోవాలో 18 ఏళ్లకు పైబడిన అందరూ ఐవర్‌మెక్టిన్ ట్యాబ్లెట్లను తీసుకోవాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ క్రమంలోనే ఆ ట్యాబ్లెట్లను ప్రభుత్వం ప్రజలకు పంపిణీ చేయనుంది. ప్రతి ఒక్కరూ 5 రోజుల పాటు ఆ ట్యాబ్లెట్లను రోజుకు ఒకటి చొప్పున, 12ఎంజీ మోతాదులో వేసుకోవాలి. కచ్చితంగా 5 ట్యాబ్లెట్లను 5 రోజుల పాటు వేసుకోవాల్సి ఉంటుంది. దేశంలోనే తొలిసారిగా గోవా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం.
యూకే, ఇటలీ, స్పెయిన్, జపాన్, సౌతాఫ్రికా, జింబాబ్వే, స్లొవేకియా, జెక్ రిపబ్లిక్, మెక్సికో వంటి అనేక దేశాల్లో ఐవర్‌మెక్టిన్‌ను కోవిడ్ బాధితులకు ఇస్తున్నారు. దీంతో వారిలో కోవిడ్ వ్యాధి తీవ్రత తగ్గుతుందని, ఈ ట్యాబ్లెట్లను తీసుకున్న కోవిడ్ బాధితులు తక్కువగా చనిపోతున్నారని సైంటిస్టులు నిర్దారించారు. కోవిడ్ రాని వారు ఈ ట్యాబ్లెట్లను వాడితే కోవిడ్ బారిన పడినా తీవ్రత ఎక్కువ కాదని, స్వల్ప లక్షణాలతో కోవిడ్ నుంచి బయట పడవచ్చని చెబుతున్నారు. అందుకనే ఈ ట్యాబ్లెట్లను ప్రతి ఒక్కరూ వాడాలని సూచించామని గోవా ప్రభుత్వం తెలియజేసింది.