మనుషులం అయిన మేము అని రాయడం అబద్ధం ఎందుకంటే ఆ మాట నిరూపణలో ఎక్కడా లేదు.ఎందుకో ఇకపై రాదు కూడా! మనుషులం అయిన మేము అని చెప్పడం కూడా అబద్ధం ఎందుకంటే విద్వేషాలు వివేకాన్ని కోల్పోయేందుకు కారణం అవుతున్నాయి కనుక! ఇటువంటి అననుకూలతల్లో నుంచి పుట్టుకువచ్చిన ప్రతీ వాదం కేవలం తమ స్వార్థం వెతికి తరువాత ఆర్థిక స్థిరతను కోరుకుంటాయి. ఓ అస్థిరతను దేశంలో ఉంచి తమదైన స్థిరత్వాన్ని పొంది ఉంటాయి. అదే నయా రాజకీయాలకు సంకేతిక. అందుకు బీజేపీ అయినా ఎంఐఎం అయినా ఏ ఇతర పార్టీ అయినా మత మరియు మతేతర పార్టీ అయినా అతీతం కాదు. మినహాయింపు లేదు.
నిస్సత్తువనై చూస్తున్నా మళ్లీ నీ కోసం..ఈ ఒక్క మాట ఫాబ్లోనెరుడా అంటున్నాడు.మనుషులలో ఏమయినా నిరాశలు ఉంటే అవి తొలగి పోయేందుకు వీలుకుదిర్చేలా ఈ వేళలు లేవు. సంబంధిత సందర్భాల్లోమనుషులు లేరు. మనుషులు ఒకరినొకరు కొట్టుకుంటూ,ఒకరితో ఒకరు విద్వేషం లేదా వైషమ్యం పంచుకుంటూ త్వరత్వరగా రాజకీయం చేస్తున్నారు. త్వరత్వరగా అతిత్వరగా ఎదిగిపోయేందుకు అనుకూల కాలాన్ని ఒకటి వెతుకుతున్నారు. కర్ణాటకలో జరుగుతున్న వైఫల్య యుద్ధం ఇదే! కేవలం సమూహ ప్రయోజన సిద్ధికి కారణం అయ్యే పనులు ఏవీ లేవు కనుక రాజకీయంలో మతం చొరబడి కొత్త రూపు కడుతోంది. ఈ నాటకం రక్తి కట్టేలోగానే ముగిసిపోవడం కూడా ఖాయం.
యుద్ధం ఆరంభం వెతకడం కష్టం అని అంటారు. అదే రీతిన ఎప్పుడు ముగిసిపోతుందో చెప్పడం కూడా కష్టమే అని కూడా చెబుతుంటారో! హిజాబ్ వివాదం ఆరంభంకు ముందు దేశం ఎన్నో విద్వేషాలను మోసి ఉంది. సమానతలనూ చూసి ఉంది. సమానత్వ పరంపర దగ్గర బీజేపీ ఎత్తుగడలో లేదా ఇతర పార్టీల ఎత్తుగడలో చూసి నవ్వుకుంది కూడా! కనుక ఎంఐఎం కోరుకున్నవిధంగా రాజకీయం ఉన్నంత వరకూ ఆ పార్టీ కి ఎదురుండదు. కానీ ఆ తరువాత వచ్చే పరిణామాల్లో ఆ పార్టీ అధోగతిని మాత్రం ఎవ్వరైనా ఆపలేరు.ఇదే సూత్రం బీజేపీకి వర్తిస్తుంది.ఇదే సూత్రం మతం ఆధారంగా నడిచే సేనలకు, సైన్యాలకూ వర్తిస్తుంది.
వివాదంలో శివసేన లేదు.వివాదంలోకి ఇంకా ఇంకొన్నిపార్టీలు ఇంకా రాలేదు కూడా!ఆ విధంగా రాకపోవడం కారణంగా కాస్తయినా ప్రశాంతతకు చోటుంది.ఇప్పటిదాకా ఉన్నవివాదంలో కొంత సంయమనం పాటిస్తున్న శక్తులు కూడా ఉన్నాయి.అవి కూడా ఉండడంవల్లే ఆ మాత్రం అయినా శాంతి అన్నది నెలకొని ఉంది.శాంతి స్మరణలో ఉన్న దేశానికి అభివృద్ధి యోగ్యత అన్నది దక్కి ఉంటుంది.కల్లోలితాలను వెలివేసిన రోజు మంచి సంకల్పం ఒకటి విజయ తీరాలకు చేరుస్తుంది దేశాన్నిమరియు మనుషులను.ఆ విధంగా ఈ దేశం మరింత అభివృద్ధికి మరింత చైతన్యానికి ఆనవాలు అయితే మేలు. అప్పుడు హిజాబ్ లాంటి వివాదాలు చిన్నబోతాయి.ఆ నల్లటి పరదాల వెనుక ఆకాశమే హద్దుగా ఎదగాలన్న కాంక్షలు అన్నవి బలీయం అయి ఉంటాయి.