మామూలుగా కన్నా ఈ ఏడాది పన్నుల వసూళ్లు బాగుంటాయని కేంద్రం ఆర్థిక శాఖ భావిస్తోంది. రెండేళ్ల కరోనా తరువాత ఇప్పుడిప్పుడే పరిణామాల్లో మార్పులు వస్తుండడంతో రానున్న కాలంలో మార్కెట్లు మరింత కుదుటపడితే, పన్నుల వసూలు గతం కన్నా యాభై శాతం ఎక్కువగానే ఉండవచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఇందుకు తగిన విధంగా కార్యాచరణ కూడా ఉండనున్నది అని కూడా తెలుస్తోంది. ప్రత్యక్ష మరియు పరోక్ష పన్నుల వసూలు కారణంగానే కేంద్రం ఆదాయం ఆధారపడి ఉంది.
ఒక లెక్క ప్రకారం గడిచిన రెండేళ్లలో మాయదారి మహమ్మారి కారణంగా పన్నుల వసూలు ఆశించిన స్థాయిలో లేవు. దీంతో చాలా మేరకు అటు కేంద్రానికి ఇటు రాష్ట్రాలకూ స్థాయికి మించిన అప్పే అవసరం అయి ఉంది. ఇందులో ఎవ్వరినీ నిందించాల్సిన పని లేదు. ఎందుకంటే కరోనా కారణంగా చాలా మంది ఇళ్లకే పరిమితం కావడం కొన్ని ముఖ్యమయిన పన్నులు కూడా చెల్లింపులో లేని కారణంగా అభివృద్ధి నిలిచిపోవడం వంటివి చోటుచేసుకున్నాయి.
తాజాగా కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్న విధంగా, ప్రధాన మీడియా నుంచి అందుకున్న వివరం ఆధారంగా గత ఏడాది పరోక్ష పన్నులు 20 శాతం, ప్రత్యక్ష పన్నులు 49 శాతం అధికంగా వసూలు అయ్యాయని తెలుస్తోంది. ఈ ఏడాది కూడా పన్నుల వసూలుకూడా బాగుంటే రానున్న కాలంలో కొన్ని అభివృద్ధి పనులను చేపట్టేందుకు వీలుంటుందని రైతులు ఆశాభావంతో ఉన్నారు. వాస్తవానికి గత ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్లో పన్నుల వసూళ్లు 22.17 లక్షల కోట్లు అని భావించినా, అంతకు మించి పన్నుల వసూళ్లు జరిగి ఖజానాకు 27.07 లక్షల కోట్లు వచ్చేయని కేంద్రం అంటోంది. అదే సూత్రం ప్రకారం ఈ ఏడాది కూడా తమకు ఆశించిన వ్యాపారం జరిగితే దేశానికి మరింత ఆదాయం పన్నుల రూపంలో ఇచ్చేందుకు తామంతా సిద్ధంగానే ఉన్నామని చిరు వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు.