జమ్మూ కాశ్మీర్ లో మరోసారి ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్ కౌంటర్ లో భద్రతా దళాలకు విజయం లభించింది. ఈరోజు తెల్లవారుజామున ఈ ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. శ్రీనగర్ లోని రైనావారి ప్రాంతంలో టెర్రరిస్టులు, భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. పోలీసులు, సీఆర్ఫీఎఫ్ దళాలు జాయింట్ గా ఆపరేషన్ చేపట్టాయి. ఈ ఎన్ కౌంటర్లో ఇద్దరు టెర్రరిస్టులను హతమార్చారు. హతమైన ఉగ్రవాదులను పోలీసులు గుర్తించారు. నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కర్ ఏ తోయిబాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. రాయిస్ అహ్మద్ భట్.. అనే ఉగ్రవాది జర్నలిస్టుగా కూడా చెలామణి అవుతున్నాడు. అనంత్ నాగ్ లో ఆన్ లైన్ న్యూస్ పోర్టల్ ‘వ్యాలీన్యూస్ సర్వీస్’ని నడుపుతున్నాడని పోలీసులు వెల్లడించారు. 2021 నుంచి ఇతను ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొంటున్నాడు. ఉగ్రవాద నేరాలకు సంబంధించి అతనిపై ఇప్పటికే రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. హతమైన రెండో ఉగ్రవాదిని బిజ్‌బెహరాకు చెందిన హిలాల్ అహ్ రాహ్‌గా గుర్తించామని, ఆయన ‘సి’ కేటగిరీ ఉగ్రవాది అని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు.