కర్ణాటక రాష్ట్రంలో ఓ జేడీఎస్ కౌన్సిలర్‌కు ఓ జిల్లా కోర్టు షాక్ ఇచ్చింది. భారీగా ఆస్తులున్న, తెల్ల రేషన్ కార్డ్ కలిగి ఉన్న నగర పాలక సంస్థ కౌన్సిలర్ ఎన్నిక చెల్లదని ప్రకటించింది. ఎన్నికల అఫిడవిట్లో వాస్తవాల్ని దాచిపెట్టారని నిర్ధరిస్తూ తుమకూరు జిల్లా సిరాలోని న్యాయస్థానం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. ఫలితంగా జేడీఎస్ కౌన్సిలర్ రవి శంకర్ పదవి కోల్పోయారు.
2021లో జరిగిన సిరా నగరపాలక సంస్థ ఎన్నికల్లో 9వ వార్డుకు జేడీఎస్ తరఫున రవిశంకర్, కాంగ్రెస్ నుంచి కృష్ణప్ప పోటీ పడ్డారు. ఈ ఎన్నికల్లో రవి శంకర్ గెలుపొందగా.. అతడి ఎన్నికను సవాలు చేస్తూ కోర్టులో పిటిషన్ వేశారు కృష్ణప్ప. ఓ క్రిమినల్ కేసులో దోషిగా తేలిన విషయాన్ని ఎన్నికల అఫిడవిట్లో పేర్కొనలేదని వాదించారు. 500 కిలోల బంగారం ఉందని, అద్దెల ద్వారా రూ.3.6లక్షల ఆదాయం వస్తోందని అఫిడవిట్లో చెప్పినా.. రవి శంకర్ పేదలకు ఇచ్చే బీపీఎల్ రేషన్ కార్డ్ కలిగి ఉన్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు కృష్ణప్ప.
ఈ ఆరోపణలపై వివరణ ఇస్తూ కౌంటర్ దాఖలు చేశారు రవి శంకర్. క్రిమినల్ కేసు గురించి అఫిడవిట్లో ప్రస్తావించడం మర్చిపోయానని కోర్టుకు నివేదించారు. తన దగ్గర 499.5కిలోల వెండి, 500 గ్రాముల బంగారం ఉందని.. అయితే అఫిడవిట్లో రెండూ కలిపి 500 కిలోల ఆభరణాలు ఉన్నాయని పేర్కొన్నానని వివరించారు. కానీ.. కోర్టు విట్నెస్ బాక్స్‌లో ఈ విషయాలు చెప్పలేదు రవి శంకర్. లిఖితపూర్వక సమాధానంతో సరిపెట్టారు.