కర్ణాటకలో హనుమాన్ జెండాను తొలగించిన ఘటనతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మాండ్య జిల్లాలోని కెరగోడు గ్రామంలో భారీ స్తంభంపై ఉన్న హనుమంతుడి జెండాను తొలగించడంతో ఘర్షణాత్మక వాతావరణం నెలకొంది. బీజేపీ, భజరంగ్దళ్తో పాటు జేడీఎస్ కార్యకర్తలు అక్కడకు భారీగా చేరుకుని నిరసనకు దిగారు. ఈ సందర్భంగా వారు పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అప్రమత్తమైన పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఎలాంటి హింసాత్మక ఘర్షణలు జరగకుండా ముందు జాగ్రత్తచర్యగా కెరగోడు గ్రామంలో మోహరించారు.
గతవారం కెరగోడు గ్రామస్థులంతా కలిసి విరాళాలు సేకరించి 108 అడుగుల స్తంభంతో హనుమ ధ్వజాన్ని నెలకొల్పి దానిపై హనుమాన్ జెండాను ఉంచారు. ఇందుకు గ్రామపంచాయతీ నుంచి ముందుగానే అనుమతి తీసుకున్నా తర్వాత కొందరు అభ్యంతరం వ్యక్తం చేయడంతో హనుమ ధ్వజాన్ని అధికారులు తొలగించారు. హనుమ ధ్వజాన్ని తొలగించిన యంత్రాంగం ఆ స్థానంలో త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేసింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతుండటంతో మరోసారి పోలీసులు భారీగా మోహరించారు.