భార్య గర్భవతిగా ఉన్న సమయంలో భర్తకు పితృత్వ సెలవులు మంజూరు చేయాలని మద్రాస్ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సెలవుల మంజూరు కోసం నిర్దిష్టమైన చట్టాలు తీసుకురావాలని ఆ కోర్టులోని మదురై బెంచ్ అభిప్రాయపడింది. తెంకాసి జిల్లాలోని కడయం పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన ధర్మాసనం.. తాజాగా ఈ వ్యాఖ్యలు చేసింది.
ఈ పిటిషన్ను విచారించిన జస్టిస్ ఎల్. విక్టోరియా గౌరి.. ఇన్స్పెక్టర్కు జారీ చేసిన నోటీసులను రద్దు చేస్తూ.. వెంటనే విధుల్లో చేరాలని ఆదేశించారు. భార్య గర్భంతో ఉన్న సమయంలో భర్త పక్కనే ఉండాల్సిన అవసరం ఉందని మదురై బెంచ్ అభిప్రాయపడింది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో గర్భవతిగా ఉన్న సమయంలో తల్లితో పాటు తండ్రికి సెలవులు ఇస్తున్నారని.. చిన్నారుల పెంపకంలో తల్లితో పాటు తండ్రి పాత్ర చాలా ముఖ్యమని గుర్తు చేసింది. భారత్లో సెంట్రల్ సివిల్ సర్వీసెస్ నిబంధనల ప్రకారం పితృత్వ సెలవులు ఇవ్వాల్సి ఉన్నా.. అనేక రాష్ట్రాలు వాటిని పాటించడం లేదని చెప్పింది. నిర్దిష్టమైన చట్టాలు, నిబంధనలు లేవని.. అందుకోసమే ప్రత్యేకమైన చట్టాలను రూపొందించాల్సిన ఆవశ్యకత ఉందని సూచించింది.