అంతా అనుకున్నట్లుగానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక రేట్లను యథాతథంగా కొనసాగించింది. ఇవాళ ప్రారంభమైన పరపతి విధాన కమిటీ సమావేశ నిర్ణయాలను గవర్నర్ శక్తికాంత దాస్ గురువారం ప్రకటించారు. రెపోరేటును 6.5 శాతం వద్ద కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. ఎంఎస్‌ఎఫ్, బ్యాంక్ రేట్ సైతం 6.75 శాతం వద్ద స్థిరంగా ఉన్నాయని తెలిపారు. రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఊతమివ్వాల్సిన అవసరం ఉందనే భావనతోనే కీలక రేట్లలో ఆర్‌బీఐ మార్పులు చేయక పోవచ్చునని గతకొంత కాలంగా విశ్లేషణలు వెలువడుతున్న విషయం తెలిసిందే.
గత ఏప్రిల్ సమావేశంలో రెపో రేటును ఎలాంటి మార్పు చేయకుండా 6.5 శాతంగా కొనసాగించారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు 2022 మే నుంచి వరుసగా ఆరు దఫాల్లో రెపో రేటును 250 బేసిస్ పాయింట్ల మేర ఆర్‌బీఐ పెంచింది. కీలక రేట్లపై నిర్ణయాన్ని తీసుకునేందుకు రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలను ఆర్‌బీఐ పరిగణనలోకి తీసుకుంటుంది. ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 18 నెలల కనిష్ఠమైన 4.7 శాతానికి దిగివచ్చిన విషయం తెలిసిందే.