మహిళా రిజర్వేషన్ల బిల్లుపై కాంగ్రెస్ నేత పి.చిదంబరం స్పందించారు. ఆ బిల్లు నీటిలో జాబిల్లి వంటిదని అన్నారు. ఈ చట్టం అమల్లోకి రావడానికి చాలా ఏళ్లు పడుతుందని అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును తాజాగా రాష్ట్రపతి ఆమోదించిన నేపథ్యంలో చిదంబరం మాట్లాడారు. రాష్ట్రపతి ఆమోదించిన మహిళా రిజర్వేషన్ ఒక భ్రమ అని ఆయన పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నిల ముందు కాకుండా తర్వాత అమలు చేస్తే ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు.
‘మహిళా రిజర్వేషన్ ఒక భ్రమ ఇది చట్ట రూపం దాల్చినా వాస్తవంలోకి రావడానికి చాలా సంవత్సరాల సమయం పడుతుంది. జనాభా లెక్కలు, డీలిమిటేషన్ ప్రక్రియ తర్వాత అమలు చేస్తామంటున్నారు. 2029 లోక్‌సభ ఎన్నికలకు ముందు కాకుండా తర్వాత అమలు చేస్తే ప్రయోజనం ఏంటని నేను అడుగుతున్నాను? ప్రధాని మోదీ ప్రజలను భ్రమల్లోకి నెడుతున్నారు. నీటిలో చంద్రుడి ప్రతిబింబం కనిపించినంత మాత్రాన చంద్రుడు అక్కడ ఉన్నట్లు కాదు. అది ఆకాశంలోనే అందనంత దూరంలో ఉంటుంది. ఈ చట్టం కూడా అంతే. దగ్గరగా ఉన్నా అమలయ్యే వరకు చాలా ఏళ్లు పడుతుంది. ఇదో ఎన్నికల జుమ్లా’ అని చిదంబరం అన్నారు.