ప్రముఖ క్యాబ్ బుకింగ్ సేవల సంస్థ ఓలా తాజాగా పార్సిల్ డెలివరీ రంగంలోకి అడుగు పెట్టింది. ఇప్పటి వరకు రైడ్ సేవలను మాత్రమే అందిస్తున్నటువంటి ఈ సంస్థ ఇక నుంచి డెలివరీలను కూడా అందించేందుకు సిద్ధం అయింది. ఓలా పార్సిల్ పేరిట డెలివరీ సేవల్ని ప్రారంభించింది. బెంగళూరు వాసులకు ఈ సేవల్ని మొదటగా పరిచయం చేసింది.
బెంగళూరులో ఓలా పార్సిల్ సర్వీస్ ను ప్రారంభించారు. ఈ సేవలను అందించటం కోసం ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లను మాత్రమే ఉపయోగిస్తాం అని ఓలా సహ వ్యవస్థాపకుడు సీఈఓ భవీశ్ అగర్వాల్ తన అధికారిక ఎక్స్ ద్వారా ప్రకటించారు.5 కిలోమీటర్ల లోపు దూరానికి రూ.25, 15 కిలోమీటర్ల దూరానికి రూ.75, అలాగే 20 కిలోమీటర్ల దూరానికి రూ.100 చార్జీలు వసూలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం బెంగళూరు నగరమంతా ఈ పార్సెల్ సర్వీసుల్ని అందుబాటులోకి తెచ్చినట్లు ఓలా తెలిపింది. రానున్న నెలల్లో దేశవ్యాప్తంగా అన్ని నగరాలకు ఈ సేవలను విస్తృతం చేయనున్నట్లు పేర్కొంది.