జులై 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

-

పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 20వ తేదీన వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు ఆగస్టు నెల 11వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ మేరకు పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీలను ప్రకటించారు.

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని ప్రతిపక్ష పార్టీలకు ప్రహ్లాద్‌ జోషి విజ్ఞప్తి చేశారు. కొంతకాలంగా ఉమ్మడి పౌర స్మృతి-యూసీసీపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. యూసీసీపై ముందడుగు వేసేలా కేంద్రప్రభుత్వం ఈ సమావేశాల్లో ఏమైనా చర్యలు తీసుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది.

మరోవైపు ఈ సమావేశాల్లోనే దిల్లీలో ప్రభుత్వ అధికారుల నియామకం, బదిలీలకు సంబంధించి కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌ స్థానంలో బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దిల్లీ ప్రభుత్వ అధికారుల నియామకం, బదిలీలపై అధికారం ఎన్నికైన ప్రభుత్వానికి ఉంటుందని  సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు చెల్లుబాటు కాకుండా ఎన్డీయే ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్‌ తెచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల కేంద్ర కేబినెట్‌ ఆమోదించిన జాతీయ పరిశోధనా ఫౌండేషన్‌కు సంబంధించిన బిల్లు కూడా ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news