ఒడిశా రాష్ట్రంలోని మల్కన్‌గిరి జిల్లా మేజిస్ట్రేట్-కమ్ కలెక్టర్ మనీష్ అగర్వాల్ పై హత్య కేసు నమోదు చేసారు ఆ రాష్ట్ర పోలీసులు. ఈ కేసు నమోదు చేసిన తర్వాత ఆయనను మరో విభాగానికి బదిలీ చేసింది. గిరిజనుల ప్రాబల్యం ఉన్న జిల్లాలో అగర్వాల్ స్థానంలో 2014 బ్యాచ్ కు చెందిన ఐఎఎస్ అధికారి యెడ్డులా విజయ్ ని నియమించారు. అగర్వాల్‌ను ప్లానింగ్ అండ్ కన్వర్జెన్స్ విభాగంలో డిప్యూటీ సెక్రటరీగా నియమించినట్లు తెలిపింది.
గత డిసెంబర్‌లో అతని వ్యక్తిగత సహాయకుడు దేబ్ నారాయణ పాండా మృతికి సంబంధించి మల్కన్‌గిరి సబ్ డివిజనల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ (ఎస్‌డిజెఎం) కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు అగర్వాల్, జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని మరో ముగ్గురిపై పోలీసులు ఆదివారం హత్య కేసు నమోదు చేశారు. గత ఏడాది డిసెంబర్ 27 న నారాయణ్ కనపడకుండా పోగా… ఒక రోజు తరువాత, అతని మృతదేహాన్ని సతిగుడ జలాశయం వద్ద స్వాధీనం చేసుకున్నారు. అతను ఆత్మహత్య చేసుకుని మరణించి ఉండవచ్చని అప్పుడు అనుమానం వచ్చినా… దాదాపు ఆరు నెలల తరువాత, నారాయణ్ భార్య బనాజా మరియు కుటుంబ సభ్యులు అతన్ని మల్కన్‌గిరి కలెక్టర్ మరియు అతని వద్ద పని చేసే కొంతమంది హత్య చేశారని ఆరోపించారు.