రాజకీయ కాక రేపుతున్న ప్రణబ్ పుస్తకం..ఎన్నో సంచలనాలు

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ జ్ఞాపకాలన్నీ వెలుగులోకి వచ్చాయి. ది ప్రెసిడెన్షియల్‌ ఇయర్స్‌ పుస్తకంలో ఆయన అనుభవాలన్నీ రాసుకొచ్చారు. ప్రణబ్‌ ముఖర్జీ చనిపోవడానికి ముందు చివరగా రాసిన ఈ పుస్తకం మార్కెట్లోకి వచ్చింది. ఈ పుస్తకంలో చాలా విషయాలు రాశారు ప్రణబ్. అందులోని కొన్ని అంశాలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో కాక రేపుతున్నాయి.

 

ప్రణబ్ తన ఆత్మకథలో చాలా సంచలన విషయాలు బయటపెట్టారు. ప్రధానమంత్రి నర్రేంద మోదీ, నవాజ్‌ షరీఫ్ వ్యక్తిగత కార్యక్రమం కోసం పాకిస్తాన్‌ వెళ్లారన్నారు. లాహోర్‌కు వెళ్లడం సరైన నిర్ణయం కాదు సర్జికల్ స్ట్రైక్‌ అనేది ఆర్మీ సాధారణంగా చేసే ప్రక్రియ మాత్రమే అని తన అభిప్రాయం చెప్పారు. ప్రజల జీవితాలతో మమేకమైన కాంగ్రెస్ జాతీయ వ్యవస్థ అని పేర్కొన్నారు. ఆలోచించగలిగే ప్రతి వ్యక్తికి కాంగ్రెస్ భవిష్యత్తు గురించి ఆవేదన ఉంటుందన్నారు.

ప్రణబ్ ముఖర్జీ పుస్తకంలో మరో సంచలన విషయాన్ని ప్రస్తావించారు. తనకు అవకాశం ఇచ్చి ఉంటే తెలంగాణ ఏర్పాటును అడ్డుకునేవాడినని పేర్కొన్నారు ప్రణబ్. తాను రాష్ట్రపతిగా వెళ్లిన తరువాత… కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చాలా అంశాల్లో తప్పుడు నిర్ణయాలు తీసుకుందని చెప్పుకొచ్చారు ప్రణబ్. సోనియాగాంధీ పార్టీని నడపంలో చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు..మహారాష్ట్రలో సరైన నాయకులపై కాకుండా ఇతరులపై పార్టీ ఆధారపడింది… అంటూ ప్రెసిడెన్షియల్‌ ఈయర్స్‌లో రాశారు ప్రణబ్.

ఆకర్షణీయ నాయకత్వాన్ని కాంగ్రెస్ కోల్పోయిందని భావిస్తున్నానని తన ఆత్మకథలో రాశారు ప్రణబ్. సమ్మోహనపరిచే నాయకత్వం లేదని గుర్తించడంలో వైఫల్యమే 2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమికి.. ఓ కారణమని ప్రణబ్‌ అభిప్రాయపడ్డారు. 2014 ఎన్నికల ఫలితాలు వెల్లడైన రోజున తాను నిరుత్సాహానికి లోనయ్యాయనన్నారు ప్రణబ్.

2016 నవంబరులో పెద్దనోట్ల రద్దు ప్రకటన చేసే ముందు ప్రధాని మోదీ తనతో చర్చించలేదన్నారు ప్రణబ్. అయితే ఇలాంటి ప్రకటనలను ఆకస్మికంగా చేయడం కచ్చితంగా అవసరమని అభిప్రాయపడ్డారు. అందువల్ల మోదీ నిర్ణయం తనను ఆశ్చర్యపరచలేదన్నారు. దీనిపై ఓ మాజీ ఆర్థిక మంత్రిగా మోదీ తన మద్దతు కోరారని పుస్తకంలో చెప్పుకొచ్చారు ప్రణబ్. ఇలాంటి సాహసోపేత నిర్ణయం వల్ల ఆర్థిక రంగం తాత్కాలికంగా మందగించే అవకాశం ఉందని తాను చెప్పానన్నారు ప్రణబ్. ప్రజలు ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించాను అని ప్రణబ్‌ తన పుస్తకంలో పేర్కొన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ, డాక్టర్ మన్మోహన్ సింగ్ ల మధ్య పోలికలపై ప్రణబ్ ముఖర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ ఆ పదవిని సాధించుకున్నారని.. మన్మోహన్ సింగ్‌కు కాంగ్రెస్ పార్టీ ఆ పదవిని కట్టబెట్టిందని… ఆయన దానిని సంపాదించుకోలేదని పేర్కొన్నారు.