ఢిల్లీలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఓ కోచింగ్ సెంటర్లోకి వరద రావడంతో ముగ్గురు విద్యార్థులు మరణించారు. ఈ ఘటనపై లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన రాహుల్.. ప్రభుత్వ సంస్థల వైఫల్యమే ఘటనకు కారణమని ఆరోపించారు. ప్రతి స్థాయిలో బాధ్యతా రాహిత్యమే మరణాలకు దారి తీసిందని తెలిపారు. భద్రత లేని నిర్మాణాల వల్ల సామాన్య ప్రజలు మూల్యం చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ చేశారు. ‘ఢిల్లీలోని ఓ భవనంలోని సెల్లార్లో వరదల మూలంగా పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న విద్యార్థులు మృతి చెందడం దురదృష్టకరం. కొద్ది రోజుల క్రితం వర్గాలకు విద్యుత్ షాక్ తోనూ ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఈ మౌలిక సదుపాయాలు పతనం అన్ని వ్యవస్థల సంయుక్త వైఫల్యం. పేలవమైన పట్టణ ప్రణాళిక, సంస్థల బాధ్యతారాహిత్యానికి ప్రజలు ప్రతి స్థాయిలో మూల్యాన్ని చెల్లిస్తున్నారు’ అని పేర్కొన్నారు. సురక్షితమైన జీవితాన్ని గడపడం ప్రతి పౌరుడి బాధ్యత అని నొక్కి చెప్పారు.