ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి మండిపడ్డారు. నెలల తరబడి అల్లర్లతో మణిపుర్ రాష్ట్రం తగలబడుతోంటే.. ప్రధాని మాత్రం పార్లమెంటులో జోకులేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా లోక్‌సభలో మోదీ మాట్లాడిన తీరును రాహుల్ తీవ్రంగా తప్పుబట్టారు. లోక్ సభలో గురువారం రోజున 2 గంటల 13 నిమిషాల పాటు సుదీర్ఘ ప్రసంగం చేసిన.. మణిపుర్ గురించి కేవలం 2 నిమిషాలు మాత్రమే ప్రస్తావించారని రాహుల్ అన్నారు.
గత కొన్ని నెలలుగా మణిపుర్‌లో ఏం జరుగుతోందో ప్రధాని మర్చిపోయినట్లున్నారని ఎద్దేవా చేశారు. ఓవైపు అల్లర్లు, అత్యాచారాలు, హత్యలతో మణిపుర్ అట్టుడుకుతోంటే.. ప్రధాని పార్లమెంట్‌లో నవ్వుతూ, జోకులు వేశారని దుయ్యబట్టారు. గతంలో ఎందరో ప్రధానులను చూశాను. కానీ, ఇలా స్థాయి దిగజారి మాట్లాడిన ప్రధానిని తాను చూడలేదని రాహుల్ వ్యాఖ్యానించారు. సమస్య కాంగ్రెస్సో, తానో కాదని.. 2024లో మోదీ మళ్లీ ప్రధానమంత్రి అవుతారా? లేదా? అన్నది కూడా కాదని.. మణిపుర్ లో ఏం జరుగుతోంది? దాన్ని ఎందుకు ఆపలేకపోతున్నాం? అనేదే ప్రధాన సమస్య అని రాహుల్ అన్నారు. దీన్ని పరిష్కరించేందుకు ప్రధాని చేతుల్లో చాలా అవకాశాలున్నాయి. కానీ, వాటిని ఆయన వినియోగించట్లేదని మండిపడ్డారు.