కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. ఈ యాత్ర మొదలుపెట్టినప్పటి నుంచి బీజేపీ విమర్శలు గుప్పిస్తూనే ఉంది. ముఖ్యంగా రాహుల్ ధరించిన టీ షర్ట్‌పై గట్టి చర్చే జరిగింది. మరోసారి రాహుల్ టీ షర్ట్ గురించి చర్చ మొదలైంది. గజగజ వణికించే చలిలోనూ రాహుల్ టీ షర్ట్ మాత్రమే ధరించి యాత్ర చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు.
దీనిపై బీజేపీ స్పందిస్తూ టీ షర్ట్ లోపల థర్మల్స్ ధరిస్తున్నారని రాహుల్‌పై ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ ఆరోపణలపై రాహుల్ స్పందించారు. గజ గజ వణికిస్తున్న చలిలోనూ తాను టీ షర్ట్ ఎందుకు ధరిస్తున్నాననే విషయంపై రాహుల్ క్లారిటీ ఇచ్చారు.
“నేను యాత్ర ప్రారంభంలో కూడా టీ షర్ట్ ధరించాను. కేరళలో ఎక్కువ వేడి ఉండటం వల్లే అప్పుడు టీ షర్ట్ వేసుకున్నాను. నా యాత్ర మధ్యప్రదేశ్ చేరుకోగానే, కొంచెం చలిగా అనిపించింది. ఆ సమయంలో ఒక ఉదయం నా దగ్గరకు ముగ్గురు పేద పిల్లలు వచ్చారు. వారు చిరిగిన బట్టలు వేసుకున్నారు. అప్పటికే వారు చలితో వణికిపోతున్నారు. ఆరోజే నిశ్చయించుకున్నాను. నాకు చలిగా అనిపించినప్పటికీ స్వెటర్ ధరించొద్దని డిసైడ్ అయ్యాను. కేవలం టీ షర్ట్ మాత్రమే ధరించాలని నిర్ణయించుకున్నాను. ఆ పిల్లల కంటే నేనేం ఎక్కువ కాదు”. అని రాహుల్ పేర్కొన్నారు.