రేప్ కేసుల్లో ‘టూ ఫింగర్ టెస్ట్’లపై సుప్రీం కోర్టు ఫైర్

-

అత్యాచారం జరిగిందో లేదోనని నిర్ధరించేందుకు మహిళలకు చేసే  ‘టూ ఫింగర్ టెస్ట్’లు  ఇప్పటికీ కొనసాగుతుండటాన్ని సుప్రీం కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. సమాజంలో ఇప్పటికీ ఇవి కొనసాగుతుండటం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. హత్యాచారం కేసులో భాగంగా ఓ నిందితుడిని దోషిగా తేల్చుతూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం ధర్మాసనం సమర్థించింది. ట్రయల్ కోర్టు తీర్పును తప్పుబట్టిన ఝార్ఖండ్ హైకోర్టు నిర్ణయాన్ని తోసిపుచ్చింది.  జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది.

“రెండు వేళ్ల పరీక్ష అనేది మహిళల గోప్యత, గౌరవమర్యాదలకు భంగం కలిగిస్తుంది. ఇప్పటికీ ఈ పరీక్షలు కొనసాగుతుండటం దురదృష్టకరం. ఇలాంటి పరీక్షలు ఎవరు చేసినా.. దుష్ప్రవర్తన నేరం కింద పరిగణించాలి” అని సుప్రీంకోర్టు పేర్కొంది.

దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని ధర్మాసనం ఆదేశించింది. ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కళాశాలల పాఠ్యాంశాల నుంచి ‘రెండు వేళ్ల పరీక్ష’కు సంబంధించిన అంశాలను తొలగించాలని స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news